– ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు లెనిన్
చండూరు, జూలై 10 : ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే ఆలోచనను కాంగ్రెస్ ప్రభుత్వం విరమించుకోవాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు లెనిన్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల కేజీ టు పీజీ విద్యా సంస్థల బంద్ పిలుపులో భాగంగా శుక్రవారం చండూరులో బంద్ విజయవంతం చేయడం జరిగింది. చండూరు పట్టణ కేంద్రంలో స్థానికంగా ఉన్న పాఠశాలల విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా లెనిన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నర ఏళ్లు గడుస్తున్న విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయకుండా కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ రాష్ట్రంలో ఉన్న 24 వేల ప్రభుత్వ స్కూళ్లను 4 వేలకు కుదిస్తామని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పడాన్ని ఖండిస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలల మూసివేత ఆలోచనలు మానుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.10 వేల కోట్ల పైగా ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయడం లేదని, ఇప్పటికీ చాలా గురుకులాలు అద్దె భవనాల్లోనే నడుస్తున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి విద్యార్థికి ఉచిత ల్యాప్టాప్ ను అందించాలని, ప్రతి విద్యార్థికి ఉచిత బస్సు పాసులు ఇవ్వాలని, ప్రతి బడికి ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ కార్పొరేటు విద్యా సంస్థల ఫీజుల దోపిడి అరికట్టడానికి ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని, విద్యాహక్కు చట్టం పకడ్బందీగా అమలు చేసి ప్రైవేటు పాఠశాలలో 25 శాతం పేద వర్గాల విద్యార్థులకు ఉచిత విద్యను అందించాలన్నారు. విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని, నూతన జాతీయ విద్యా విధానం -2020 ని అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి కురుపాటి పరమేష్, ఇరిగి ప్రవీణ్, ఏఐవైఎఫ్ నాయకుడు గడ్డం నవీన్, పల్లె రాజు, పల్లె చరణ్, చందు, జోగేందర్ పాల్గొన్నారు.