ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బడి బాట
ఇంగ్లిష్ మీడియం చదువులపై అవగాహన
ఇంటింటికీ తిరిగి చైతన్యం చేస్తున్న ఉపాధ్యాయులు
మన ఊరు-మన బడికి విశేష స్పందన
మూడ్రోజుల్లో 1,421అడ్మిషన్లు
బడీడు పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం చేపట్టాయి. ఇందులో భాగంగా సర్కారు బడిలోని బోధన, వసతులపై ప్రజలను చైతన్యం చేస్తూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పంపాలని ఉపాధ్యాయులు ప్రచారం చేపడుతున్నారు. ఈ నెల 2న ప్రారంభమైన బడిబాట కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుండగా.. గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ఉదయం 7నుంచి 11గంటల వరకు ఇంటింటికీ కరపత్రాలు పంచుతూ ప్రచారం చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1నుంచి 8వ తరగతి వరకు ప్రవేశపెట్టే ఆంగ్ల మాధ్యమం గురించి అవగాహన కల్పిస్తూ సర్కార్ బడిపై భరోసా పెంచుతున్నారు.
రామగిరి, జూన్ 4 : ప్రభుత్వ బడుల బలోపేతానికి విద్యా శాఖ బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా ఈ నెల 2నుంచి 10వరకు ప్రత్యేక ఎన్రోల్మెంట్ చేపడుతున్నారు. ఇందులో గ్రామ, పట్టణాల్లోకి ఇంటింటికీ ఉపాధ్యాయులు వెళ్లి సర్కారు బడి వసతులు, ఆంగ్ల మాధ్యమం ప్రవేశంపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ నెల 13నుంచి 30వరకు రోజువారీగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన పెంచి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేలా కృషి చేయనున్నారు.
మూడ్రోజుల్లో 1421 మంది విద్యార్థుల గుర్తింపు..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులు పూర్తిగా నిమగ్నమయ్యారు. ఉదయం 7గంటలకే ఆయా గ్రామాల్లోని బడికి వెళ్లి పిల్లలు, అంగన్వాడీ టీచర్లు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామంలో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ఆప్యాయంగా పలుకరిస్తూ ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిషు మీడియం ప్రవేశం, మౌలిక వసతులు, నాణ్యమైన విద్య, మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు వంటి వాటిని వివరిస్తూ సర్కారు బడులపై భరోసా కల్పిస్తున్నారు. తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న మౌలిక వసతులు, ఇతర అంశాలను వివరిస్తున్నారు. మూడ్రోజుల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1421 మంది విద్యార్థులను గుర్తించి ఆయా ప్రాంతాల్లోని బడుల్లో చేర్పించేలా చర్యలు చేపట్టారు. కొత్తగా నమోదైన విద్యార్థుల వివరాలను www.schooledu.telangana.gov.in పోర్టల్లో సీఆర్పీలు, హెచ్ఎంలు, ఎంఈఓలు అప్లోడ్ చేస్తున్నారు.
బడిబాట ముఖ్య ఉద్దేశాలు..
వినూత్నంగా బడిబాట ప్రచారం
తిరుమలగిరి సాగర్, జూన్ 4 : ప్రభుత్వ ఉపాధ్యాయుడు సైదిరెడ్డి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహిస్తున్నారు. తిరుమలగిరి సాగర్ మండలంలోని అల్వాల గ్రామంలో తన ద్విచక్ర వాహనానికి బడిబాట ఫ్లెక్సీ కట్టుకొని ప్రచారం చేస్తున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న విద్య, సౌకర్యాలను వివరించి సర్కారు బడిలో చేరేలా కృషి చేస్తున్నారు.
విజయవంతంగా బడిబాట..
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విధిగా ఆయా గ్రామ, పట్టణాలకు ఉదయం 7గంటలకు వెళ్లి 11వరకు బడిబాట నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల విశిష్టత, వసతులు, మౌలిక సదుపాయాలు, అమలు తీరును తెలియజేస్తున్నారు. మన ఊరు – మన బడిలో అమల్లోకి తీసుకొచ్చే ఆంగ్ల మాధ్యమంపై అవగాహన కల్పించి బడి బయట పిల్లలను, కొత్త వారిని బడుల్లో చేర్పించే లక్ష్యంతో ప్రత్యేక ప్రణాళికతో ప్రచారం సాగిస్తున్నారు. ప్రతి విద్యార్థి సర్కారు బడికి రావాలనే సంకల్పంతో జిల్లాలోని 31 మండలాల్లోని అన్ని యాజమాన్యాల ప్రభుత్వ పాఠశాలల ఆధ్వర్యంలో బడిబాట సాగుతుంది. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య మరింత పెంచేలా ప్రణాళికలు చేసి ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు, అందరి సహకారంతో బడిబాట నిర్వహిస్తున్నాం.
– బి.భిక్షపతి, నల్లగొండ డీఈఓ