మునుగోడు, మార్చి 25 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు. సీపీఎం పోరుబాట సర్వే కార్యక్రమంలో భాగంగా మునుగోడు మండలంలో తమ దృష్టికి వచ్చిన పలు సమస్యల పరిష్కారం కోరుతూ వినతిపత్రాన్ని మంగళవారం తాసీల్దార్ నరేందర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాల్లో అర్హులైన నిరుపేదలకు రేషన్ కార్డులు, వృద్ధాప్య పింఛన్, ఇందిరమ్మ ఇల్లు, ఇండ్ల స్థలం కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులకు అందించాలని కోరారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు.
గతంలో పల్లె వెలుగు బస్సులు నడిపి నిలిపివేసిన ప్రతి గ్రామానికి బస్సు సర్వీసును పునరుద్ధరించాలన్నారు. మండలంలోని అన్ని గ్రామాలకు, మరో మండలానికి లింక్ రోడ్ల నిర్మాణం, నూతనంగా బీటీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలన్నారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న రైతు భరోసా, రూ.2 లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వేసవికాలం దృష్టిలో ఉంచుకుని అధికారులు, ప్రజా ప్రతినిధులు గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
కిష్టాపురం గ్రామ శివారులో నిర్మిస్తున్న ఫార్మా కంపెనీ అనుమతులు రద్దు చేయాలని, లేనిపక్షంలో సీపీఎం ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాల ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి సాగర్ల మల్లేశ్, మండల కమిటీ సభ్యులు మిర్యాల భరత్, యాస రాణి, శ్రీను, వేముల లింగస్వామి, యాట యాదయ్య, పగడాల కాంతయ్య, లింగస్వామి, వంటేపాక రమేశ్, ఎర్ర సుధాకర్, ఎర్ర మహేందర్ పాల్గొన్నారు.