స్వరాష్ట్రంలో గిరిజన ప్రాంతాలకు మహర్దశ పట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ఇప్పటికే తండాలన్నీ గ్రామ పంచాయతీలుగా మారి గిరిజనులే ప్రజాప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారు. మిషన్ భగీరథ ద్వారా సురక్షిత తాగునీటితోపాటు నిరంతరం కరెంట్ సరఫరా జరుగుతున్నది. ఇక తండాలకు మెరుగైన రహదారుల కోసం కేసీఆర్ సర్కార్ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఇందులో భాగంగా గిరిజన ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి భారీగా నిధులు కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 252 మట్టి రోడ్లకు రూ.444.21 కోట్లను కేటాయించగా అందులో మూడో వంతు ఉమ్మడి నల్లగొండ జిల్లాకే దక్కడం విశేషం. నల్లగొండ, నకిరేకల్ నియోజకవర్గాలు మినహా మిగతా 10 నియోజకవర్గాల్లో మొత్తం 222.95 కిలోమీటర్ల పొడవున 90 రోడ్లను బీటీ రోడ్లుగా మార్చనున్నాయి. అందుకోసం రూ.185.96 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే పలు దఫాలుగా రోడ్లను నిర్మించిన ప్రభుత్వం తాజాగా ఒకేసారి పెద్ద మొత్తంలో బీటీ రోడ్లుగా తీర్చిదిద్దనుండడంతో తండాల్లో హర్షం వ్యక్తమవుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే తండాల అభివృద్ధి సాధ్యమవుతుందని గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్7(నమస్తే తెలంగాణ) :సమైక్య రాష్ట్రంలో ఎవరూ పట్టించుకోక పోవడంతో గిరిజన తండాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేవి. కనీస అవసరాలైన తాగునీరు, కరెంటు, రహదారులు లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉద్యమ సమయం నుంచే గిరిజన తండాలపై కేసీఆర్ ప్రత్యేక దృష్టితో ఉన్నారు. ఇతర ప్రాంతాల మాదిరిగానే తండాల్లో సైతం సకల సౌకర్యాలు కల్పించాలని ఆనాడే చెప్పారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఆయన చెప్పిన మాట ప్రకారం గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో కృషి చేస్తూ వస్తున్నారు. స్వరాష్ట్రంలో గిరిజన తండాల రూపురేఖలు మార్చివేస్తున్నారు. ఇప్పటికే మిషన్‌భగీరథ ద్వారా తండాల్లో ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తున్నారు. నిరంతర కరెంటుతోనూ తండాల్లో వెలుగులు నిండాయి. ఇదే సమయంలో ఇచ్చిన మాట మేరకు 500 జనాభా కలిగిన తండాలన్నింటినీ గ్రామ పంచాయతీలుగా మారుస్తూ 2018 మార్చి 28న ప్రత్యేక చట్టం తీసుకువచ్చారు. దీని ప్రకారమే 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ పంచాయతీలుగా మారిన తండాల్లో గిరిజనులే పాలకులయ్యారు. దాంతో పాటు పోడు భూములకు పట్టాలతో పాటు ఇతర అన్ని ప్రభుత్వ పథకాలు తండాలకు చేరాయి. ప్రస్తుతం తండాలకు వెళ్లే రహదారులపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. గ్రామ పంచాయతీలుగా ఏర్పడిన తండాలకు రోడ్డు సదుపాయం కల్పించేందుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారు. పలు దఫాలుగా నిధులు కేటాయించగా ఇప్పటికే చాలా తండాలకు రోడ్లు ఏర్పాటు చేశారు. తాజాగా భారీ మొత్తంలో రోడ్లకు నిధులు కేటాయించారు. ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి ఉమ్మడి జిల్లాకు 222.95 కిలోమీటర్ల రోడ్లను బీటీగా మార్చేందుకు రూ.185.96 కోట్లు కేటాయించారు. 10 నియోజకవర్గాల్లోని మొత్తం 90 రోడ్లు త్వరలో బీటీగా మారనున్నాయి.
222.95 కిలోమీటర్లు.. రూ.185.96 కోట్లు
ఉమ్మడి జిల్లాలోని నల్లగొండ, నకిరేకల్ మినహా మిగతా పది నియోజకవర్గాల్లోని తండాల రోడ్లకు నిధులు మంజూరయ్యాయి. అత్యధికంగా ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గమైన దేవరకొండకు అధిక నిధులను కేటాయించారు. ఈ నియోజకవర్గంలోని కొండమల్లేపల్లిలో 6 రోడ్లు, చందంపేటలో 10, నేరేడుగొమ్ములో 3, దేవరకొండలో 14, పీఏపల్లిలో 2, డిండిలో 3 రోడ్లు మొత్తం 38 రోడ్లకు నిధులు కేటాయించారు. ఆరు మండలాల పరిధిలోని మొత్తం 82.85 కిలోమీటర్ల మేర మట్టి రోడ్లను రూ.67 కోట్లతో బీటీగా మార్చనున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో 25.20 కిలోమీటర్ల మేర 11 రోడ్లను రూ.22.38 కోట్లతో బీటీగా మార్చనున్నారు. వీటిల్లో మిర్యాలగూడ మండలంలో 4, దామరచర్లలో 5, అడవిదేవులపల్లి, వేములపల్లిల్లో ఒక్కొక్క టి చొప్పున రోడ్లు ఉన్నాయి. మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండలంలో ఏడు కిలోమీటర్ల మేర ఉన్న ఒక రోడ్డుకు రూ.6.90 కో ట్లు కేటాయించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని త్రిపురారం మండలంలో రెండు రహదారులు,ఒక బ్రిడ్జితో కలిపి మొత్తం 11.40 కిలోమీటర్ల రోడ్డును రూ.9.10 కోట్లతో బీటీగా చేయనున్నారు.
తుంగతుర్తిలో 41.10 కిలోమీటర్లు
సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా తుంగతుర్తి నియోజకవర్గంలోని తండాల రహదారులకు నిధులు మంజూరయ్యాయి. ఇక్కడ మొత్తం 41.10 కిలోమీటర్ల 15 రోడ్లను రూ.34.32 కోట్లతో బీటీగా తీర్చిదిద్దనున్నారు. మద్దిరాలలో 3, తుంగతుర్తిలో 2, తిర్మలగిరిలో 5, జాజిరెడ్డిగూడెంలో 2, నూతనకల్‌లో 2, నాగారంలో ఒక రోడ్డు బీటీగా మారనుంది. సూర్యాపేట నియోజకవర్గంలో రూ.14.75 కోట్లతో 15.90 కిలోమీటర్ల ఆరు రహదారులను తారు రోడ్లుగా నిర్మించనున్నారు. చివ్వెంలలో 3, సూర్యాపేటలో రెండు, పెన్‌పహాడ్‌లో ఒక రోడ్డుకు నిధులు విడుదలయ్యాయి. కోదాడ నియోజకవర్గంలో మొత్తం 8 తండాల రోడ్లకు నిధులు మంజూరయ్యాయి. అనంతగిరిలో రెండు, మోతెలో నాలుగు, చిలుకూరులో ఒకటి బీటీ రోడ్లుగా మారనున్నాయి. మొత్తం 14.80 కిలోమీటర్ల మేర ఉన్న రోడ్లకు 11.70 కోట్ల రూపాయలను కేటాయించారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో మేళ్లచెర్వులోని కిలోమీటర్న్నర రోడ్డు కోసం రూ.1.20 కోట్లు కేటాయించారు.
యాదాద్రి భువనగిరి జిల్లాకు రూ.19.50 కోట్లు
యాదాద్రి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గానికి ఐదు రోడ్లుకు నిధులు మంజూరు చేశారు. తుర్కపల్లి మండలంలోని నాలుగు రోడ్లను రూ.7.40 కోట్లతో 8.20 కిలోమీటర్ల మేర బీటీగా తీర్చిదిద్దనున్నారు. మోటకొండూరు మండలంలో రెండున్నర కిలోమీటర్ల మట్టి రోడ్డును రూ.2.30 కోట్లతో తారురోడ్డు వేయనున్నారు. భువనగిరి నియోజకవర్గంలోని బీబీనగర్‌లో మూడు తండాల రోడ్లను రూ.6.65కోట్లతో 9.50 కిలోమీటర్ల మేర తారురోడ్లుగా నిర్మించనున్నారు. భువనగిరి మండలంలో నాలుగున్నర కిలోమీటర్ల రోడ్డును రూ.3.15కోట్లతో బీటీగా మార్చనున్నారు. ఈ నెల 5వ తేదీన గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ఇప్పటివరకు తారురోడ్లు లేని గిరిజన తండాలకు భారీగా నిధులను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు యుద్ద ప్రాతిపాదికన పనులను ప్రారంభించాలని ఆదేశించింది. దాంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌తోనే తండాల అభివృద్ధి సాధ్యమైందంటూ ప్రశంసిస్తున్నారు.