మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతామన్న మాట నిలబెట్టుకుంటున్నారు. తాజాగా నియోజకవర్గానికి ఎస్టీ గురుకులాన్ని మంజూరు చేశారు. ఈ మేరకు సంస్థాన్ నారాయణపురంలో ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చొంగ్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించనున్నారు. ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు క్లాసులు కొనసాగనున్నాయి. ఒక్కో తరగతిలో 40 మంది చదువుకునే అవకాశం ఉండగా 400 మంది గిరిజన విద్యార్థులకు గురుకుల విద్య అందనున్నది. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి రాష్ట్ర సర్కారు పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తున్నది. ఇప్పటికే చౌటుప్పల్‌లో వంద పడకల ఆస్పత్రికి శంకుస్థాపన, కిడ్నీ బాధితులకు డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. మర్రిగూడలో 30పడకల హాస్పిటల్‌ను ప్రారంభించింది. త్వరలో చండూరు డివిజన్ ఏర్పాటు కానున్నది.
– యాదాద్రి భువనగిరి, జూలై 30 (నమస్తే తెలంగాణ)
యాదాద్రి భువనగిరి, జూలై 30 (నమస్తే తెలంగాణ) : మునుగోడు ఉప ఎన్నిక సమయంలో సీఎం కేసీఆర్ పలు హామీలు ఇచ్చారు. అందులో సంస్థాన్ నారాయణపురం మండలంలో ఎస్టీ గురుకులం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం గిరిజన బాలుర గురుకుల పాఠశాలను మంజూరు చేశారు. ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తరగతులు కొనసాగనున్నాయి. ఒక్కో తరగతిలో 40మందికి చదువుకునే అవకాశం ఉన్నది. మొత్తంగా సుమారు 400మంది గిరిజన విద్యార్థులకు గురుకుల విద్య అందనుంది. ఈ విద్యా సంవత్సరం నుంచే గురుకులాన్ని ప్రారంభించనున్నట్లు జీఓలో పేర్కొన్నారు. అదేవిధంగా పునరావృతమయ్యే ఖర్చుల కోసం (రికరింగ్ ఎక్స్పెండేచర్) రూ.8,82,43,044, పునరావృతం కాని ఖర్చుల కోసం రూ.3.33కోట్లు మంజూరు చేశారు. గురుకులంలో టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులను ఆర్థిక శాఖ ద్వారా ప్రత్యేకంగా మంజూరు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. కాగా, ఇప్పటికే జిల్లాలో ఆశ్రమ పాఠశాల కొనసాగుతున్నది. ఉప ఎన్నికలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయి.
నియోజకవర్గాన్ని మంత్రి కేటీఆర్ దత్తత తీసుకోవడంతో నిధుల వరద పారుతున్నది. ఎప్పటికప్పుడు నిధులు మంజూరవుతున్నాయి. ఇటీవల నియోజకవర్గంలోని గ్రామాల మధ్య లింక్ రోడ్లకు పంచాయతీరాజ్ విభాగం నుంచి ప్రత్యేకంగా నిధులను మంజూరు చేసింది. మొత్తంగా 38 రోడ్లకు రూ.74.16 కోట్లను కేటాయించింది. దీంతో పలు గ్రామాల మధ్య ఇప్పటి వరకు ఉన్న మట్టి రోడ్లను బీటీగా మార్చనున్నారు. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు పూర్తి చేసేందుకు కసరత్తు కొనసాగుతున్నది. ఇప్పటికే చౌటుప్పల్ నుంచి సంగెం వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు.
మునుగోడు ఉప ఎన్నిక తర్వాత చౌటుప్పల్ దశ దిశ మారుతున్నది. మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.45 కోట్లు కేటాయించగా, ఇప్పటికే 20 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. భారీగా నిధులు విడుదల కావడంతో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు చేపడుతున్నారు. దీంతో వివిధ కాలనీలు అద్దంలా మారాయి. చౌటుప్పల్‌కు త్వరలోనే మరో రూ.25 కోట్లు మంజూరు కానున్నాయి. ఇక చండూరు మున్సిపాలిటీ కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకుంటున్నది. చండూరులోని పలు అభివృద్ధి పనులకు స్వయంగా మంత్రి కేటీఆర్ హాజరై శంకుస్థాపన చేశారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు, సమీకృత మార్కెట్, షాపింగ్ కాంప్లెక్స్, మున్సిపల్ కార్యాలయ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. వీటికి సంబంధించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. గట్టుప్పల్, సంస్థాన్ నారాయణపురానికి చేనేత క్లస్టర్లు మంజూరయ్యాయి.
ఉప ఎన్నికలో ఇచ్చిన హామీ మేరకు చండూరును రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. త్వరలోనే డివిజన్ ఏర్పాటు ఆదేశాలు వచ్చే అవకాశం ఉన్నది. చండూరు, మునుగోడు, నాంపల్లి, మర్రిగూడ, గట్టుప్పల్ మండలాలతో డివిజన్ ఏర్పాటు కానుంది. రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో ఆర్డీఓ ఆఫీసు, డీఎస్పీతోపాటు అనేక కొత్త కార్యాలయాలు ఏర్పాటవుతాయి. అంతేకాకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయి.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చౌటుప్పల్‌లో ఉన్న 30 పడకల ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేశారు. వంద పడకల దవాఖానకు మంత్రులు హరీశ్‌రావు, గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అంతేగాకుండా రూ.36 కోట్లను మంజూరు చేసింది. దవాఖాన పూర్తయితే 20మందికి పైగా డాక్టర్లు, 100 మందికిపైగా వైద్య సిబ్బందితోపాటు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. సుమారు 9మండలాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. శస్త్ర చికిత్సలు ఉచితంగా చేయనున్నారు. జాతీయ రహదారి 65 ప్రమాద బాధితులకు అత్యవసర సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇక ఇప్పటికే చౌటుప్పల్‌లో కిడ్నీ బాధితుల కోసం డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ నిత్యం పదుల సంఖ్యలో ఉచితంగా సేవలు పొందుతున్నారు. ఫలితంగా పేదలపై ఆర్థిక భారం తగ్గుతున్నది. మర్రిగూడ మండల కేంద్రంలో ప్రభుత్వ ఆస్పత్రిని ప్రారంభించి వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చారు.
నారాయణపురానికి గిరిజన గురుకుల పాఠశాల మంజూరుపై ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పాఠశాల మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌కు ఆదివారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే పాఠశాల ఏర్పాటు పనులను ప్రారంభిస్తామని పేర్కొన్నారు.