యాదగిరిగుట్ట, ఏప్రిల్ 17 : యాదగిరిగుట్ట మండలం గౌరాయిపల్లి గ్రామంలోని బొల్లవాని కుంటను అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కొల్లగొడుతున్నాడు. మట్టితో పూడ్చి మొత్తం కుంటను చదును చేశాడు. గౌరాయిపల్లి నుంచి సాదువెల్లి గ్రామానికి వెళ్లే దారిలో ఐదెకరాల విస్తీర్ణంలో బొల్లవానికుంట ఉంది.
ఈ కుంట ఆధారంగా బోర్లు, బావుల్లోని నీటితో చుట్టుపక్కల రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు. కాగా, సదరు కాంగ్రెస్ నేత ఇటీవల కుంటకు సంబంధించిన కట్టను ధ్వంసం చేసి, మొత్తం ఐదెకరాల విస్తీర్ణంలో ఉన్న కుంటను మట్టిని నింపి చదువును చేశాడు. ఇదంతా బాహాటంగా జరుగుతున్నా ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని చుట్టపక్కల రైతులు వాపోతున్నారు. ఈ కుంట లేకుంటే మా భూములు పడావు పడుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నియోజకవర్గంలోని అధికార పార్టీకి చెందిన ముఖ్య ప్రజాప్రతినిధి అండదండలు చూసుకుని ఇష్టారాజ్యంగా కుంటను కబ్జా చేస్తున్నాడని మండిపడుతున్నారు. కాగా, బొల్లవానికుంట ధ్వంసం చేయడంతోపాటు కబ్జా చేశారని యాదగిరిగుట్ట ఇరిగేషన్ శాఖ ఈఈ అశోక్ ఆనంద్ ఈ నెల 8న జిన్నా సాగర్‌రెడ్డి అనే వ్యక్తిపై యాదగిరిగు ట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయినా నేటికీ పోలీసులు అతడిపై కేసు నమోదు చేయలేదని రైతులు వాపోతున్నారు. అధికార పార్టీ కీలక ప్రజాప్రతినిధి అండదండలు ఉండడంతో పోలీసులు జంకుతున్నట్లు ఆరోపిస్తున్నారు.
పోలీసులు స్పందించకపోతే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం
గత నెల 21న బొల్లవాని కుంట పరిశీలనకు వెళ్లాం. కుంట కట్టను పూర్తిగా ధ్వంసం చేసి చదును చేశారు. ఆ పక్కనే భూమి ఉన్న జిన్నా సాగర్‌రెడ్డి కబ్జా చేసినట్లు మా విచారణలో తేలింది. కుంటను తిరిగి పునరుద్ధరించాలంటూ అతడికి రెండు వారాలు గడువు ఇచ్చాం. ఫలితం లేకపోవడంతో పోలీసులకు అన్ని ఆధారాలతో ఈ నెల 8న ఫిర్యాదు చేశాం. పోలీసులు చర్యలు తీసుకోకపోతే కలెక్టర్ ఫిర్యాదు చేస్తాం.