యాదాద్రి భువనగిరి జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గురువారం విస్తృతంగా పర్యటించారు. పురాతన ఆలయాలు, చారిత్రక మందిరాలను దర్శించుకున్నారు. స్వామివార్లకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం 3.03గంటలకు కొలనుపాకకు చేరుకున్న గవర్నర్ రాత్రి 9 గంటల వరకు ఆరు గంటలపాటు జిల్లాలోనే ఉన్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, వేద పండితులు ఘన స్వాగతం పలికారు. కలెక్టరేట్లో రచయితలు, కళాకారులు, జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డు గ్రహీతలతో నిర్వహించిన ముఖాముఖిలో గవర్నర్ పాల్గొన్నిముచ్చటించారు.
జనగాం పర్యటన ముగించుకుని గవర్నర్ జిష్ణుదేవ్ నేరుగా ఆలేరు మండలంలోని కొలనుపాకకు చేరుకున్నారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, కలెక్టర్ హన్మంతు కే జెండగే, డీసీపీ రాజేశ్చంద్ర స్వాగతం పలికారు. తొలుత జైన మందిరాన్ని సందర్శించిన గవర్నర్ ఆ పరిసరాల్లో కలియదిరిగారు. మందిరం చరిత్ర, కట్టడాల ప్రత్యేకతలను నిర్వాహకులు వివరించారు. 3.30 గంటలకు సోమేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న గవర్నర్‌కు బతుకమ్మలు, బోనాలు, కోలాటాలతో మహిళలు, పూర్ణకుంభంతో వేద పండితులు, ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న గవర్నర్ అభిషేకం చేశారు. మ్యూజియం, శాసనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అర్చకులు జిష్ణుదేవ్ వర్మకు ఆశీర్వచనాలు అందించి.. చిత్రపటాన్ని బహూకరించారు. అనంతరం భువనగిరి పట్టణ పరిధిలోని స్వర్ణగిరి వేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లగా.. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్‌రెడ్డి, ఆలయ ధర్మకర్తలు మానేపల్లి రామారావు, మురళీకృష్ణ స్వాగతించారు. వేదపండితులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేంకటేశ్వరుడికి గవర్నర్ ప్రత్యేక పూజలు చేశారు. ఆదిమూల మహాగణపతి, కన్యకాపరమేశ్వరి, హనుమాన్ విగ్రహాన్ని దర్శించుకున్నారు. స్వామివారి గంటను మోగించారు. జలనారాయణుడి విగ్రహం వద్ద పూజలు చేశారు. కల్యాణ మండపాన్ని సందర్శించి నిర్మాణ వివరాలు తెలుసుకున్నారు.
స్వర్ణగిరి నుంచి గవర్నర్ యాదాద్రి భువనగిరి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి.. రచయితలు, కళాకారులు, జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డు గ్రహీతలతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ముందుగా కలెక్టర్ హనుమంత్ కే జెండగే జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలు అవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. స్వాతంత్య్ర సమరయోధులు మన్నె గోపాలరెడ్డి, పద్మశ్రీ కూరెళ్ల విఠలాచార్య, కేతావత్ సోమ్లానాయక్‌ను గవర్నర్ వారి వద్దకే వెళ్లి శాలువాలతో సతరించారు. రాత్రి 8.05 గంటలకు ముఖాముఖి ముగియగా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కే గంగాధర్ వందన సమర్పణ చేశారు. గవర్నర్ అక్కడే భోజనం చేసి రాత్రి 9గంటలకు హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్లారు. సమావేశంలో గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.వెంకటేశం, జాయింట్ సెక్రటరీ జె.భవానీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఆధ్యాత్మికంగా, సంసృతిపరంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఎంతో ప్రసిద్ధి చెందిందని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. జిల్లాలో పద్మశ్రీ అవార్డులు పొందిన వారు ఎకువగా ఉండడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. చేనేత సంసృతి చాలా గొప్పదని, చేనేత రంగంలో జిల్లా ప్ర పంచ ప్రసిద్ది గాంచిందని, చేనేతను అందరూ ప్రోత్సహించాలని అన్నారు. జిల్లాకు రావడం చాలా సంతోషంగా ఉందని, మళ్లీ ఒకసారి వస్తానని చెప్పారు. స్వచ్ఛభారత్ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయడం అభినందనీయమన్నారు.
గవర్నర్ కార్యక్రమం అంటేనే రాజకీయాలకు అతీతం. ప్రత్యేకంగా ప్రొటోకాల్ ఉంటుంది. కానీ జిల్లాలో జరిగిన గర్నవర్ పర్యటన కాంగ్రెస్ శ్రేణులతో కొనసాగింది. కొంతమందికే ఆహ్వానం ఉందని అధికారులు చెప్పినా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు హంగామా చేశారు. స్వర్ణగిరి ఆలయం వద్ద చుట్టూ కాంగ్రెస్ నేతలే కనిపించారు. కలెక్టరేట్లో ఎక్కడ చూసినా వారే. అడిషనల్ కలెక్టర్ సీసీ చాంబర్లు కాంగ్రెస్ శ్రేణులతో నిండిపోయాయి. ముఖాముఖి కార్యక్రమంలో పలువురు కనిపించారు. గతంలోనూ పలు అధికారిక కార్యక్రమాల్లో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు హంగామా చేశారు. అధికారులు సైతం పట్టించుకోపోవడం గమనార్హం.
కలెక్టరేట్లో నిర్వహించిన గవర్నర్ ముఖాముఖి కార్యక్రమంలో కవులు, కళాకారులు, వివిధ రంగాల అవార్డు గ్రహీతలకు అవమానం జరిగింది. సుమారు 20 నుంచి 30 మంది ప్రముఖులను ఆహ్వానించగా, ముగ్గురు, నలుగురికి మాత్రమే సన్మానం చేసి చేతులు దులుపుకున్నారు. కనీసం వారిని పరిచయం చేయలేదు. మాట్లాడే అవకాశం కల్పించలేదు. ఐదు రోజులుగా తమను సిద్ధంగా ఉండమని చెప్పి, ఆఖరికి తుస్సుమనుపించారని చెప్పుకొచ్చారు. గవర్నర్ కార్యక్రమానికి ఐదు గంటలపాటు వెయిట్ చేయించి, తమను పట్టించుకోలేదని సదరు ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. భోజన కార్యక్రమం సమయంలోనూ గందరగోళంగా ముగించారని వాపోయారు. పాల్గొన్న వారిలో పద్మశ్రీ అవార్డు గ్రహీతలు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు, కాళోజీ అవార్డు, తెలంగాణ యువ పురస్కారం, జాతీయ ఉత్తమ రచయితలు, కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు గ్రహీతలు తదితరులు ఉన్నారు.