– ఏఐవైఎఫ్ నల్లగొండ జిల్లా కార్యదర్శి తీర్పారి వెంకటేశ్వర్లు
మునుగోడు, మార్చి 23 : యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఏఐవైఎఫ్ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి తీన్మార్ వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం మునుగోడు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల లేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్లో భగత్ సింగ్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ స్కీమ్ తీసుకొచ్చి దేశంలోని నిరుద్యోగ సమస్య పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. దేశ స్వాతంత్రం కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బ్రిటిష్ పార్లమెంటుపై బాంబుల దాడి చేసి ఉరికంబాన్ని ఎక్కిన మహానీయుడు భగత్ సింగ్ అని కొనియాడారు. నేటి యువత భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్దేవ్ ల ఆశయాలను ఆదర్శంగా తీసుకుని పోరాడాలని పిలుపునిచ్చారు.
దేశ వ్యాప్తంగా ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న యుద్ధాన్ని వెంటనే ఆపాలన్నారు. భారత ప్రధాని యుద్ధంపై మౌనం వీడాలని, శాంతి చర్చలతో ఇరు దేశాలను ఒప్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి బండారు శంకర్, సిపిఐ మండల కార్యదర్శి చాపల శ్రీనివాస్, కార్యవర్గ సభ్యుడు కట్కూరి లింగస్వామి, ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి గోపగోని ఉదయ్, ఏఐవైఎఫ్ నాయకులు రాసమల్ల మహేశ్, అందుగుల నరేశ్, చింతల రమేశ్, గజ్జల కిషన్, బద్దుల శశి, చివర్ల నాగరాజు, శివ, ధనుంజయ్, కార్తీక్ పాల్గొన్నారు.