యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ):రైతులపై ప్రభుత్వం కక్షగట్టినట్లు వ్యవహరిస్తున్నది. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం కొనకుండా నిర్లక్ష్యం చేస్తున్నది. వరి కోతలు పుంజుకొని..ధాన్యం కేంద్రాలకు వస్తు న్నా కొనుగోలు చేయకుండా చోద్యం చూస్తున్నది. వర్షాలు కురిసి ఆరబెట్టిన వడ్లు తడిసిము ద్దవుతున్నా కనికరిస్త లేదు. రైతులు చేసేదేం లేక తక్కువ ధరలకే దళారులకు అమ్ముకుంటున్నా రు. దీంతో ప్రభుత్వ మద్దతు ధర కోల్పోవడంతో వేలల్లో నష్టపోతూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నష్టాల ఎవుసం చేయలేమంటున్నారు.
ధాన్యం కొనడం లేదు..
వానకాలం సీజన్‌కు సంబంధించి యాదాద్రి భువనగిరి జిల్లాలో 2.06 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇందులో 1.86 లక్షల ఎకరాల్లో దొడ్డు రకం, 20 వేల ఎకరాల్లో సన్నాలు వేశా రు. ఈసారి 4.58 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో రైతుల అవసరాలు పోనూ 2.80లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు వడ్లు, 20 లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం కొనాలని నిర్ణయించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ధా న్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభానికి నోచుకోవడం లేదు. ఇప్పటికే మండలాల్లో వరి కోత లు పుంజుకున్నాయి. సాధారణంగా అక్టోబర్ మొదటి వారంలోనే కొనుగోళ్లు షురూ కావాలి. ఇప్పటి వరకు జిల్లాలో గురువారం మధ్యా హ్నం వరకు కేవలం 10 సెంటర్ల వరకు మాత్ర మే ప్రారంభించారు. ఇందులో కొన్నింట్లో ధాన్యం కూడా కొనడం లేదు. దీంతో కొనుగోలు కేంద్రా ల్లో ఎక్కడ పోసిన ధాన్యం అక్కడే కుప్పలుగా దర్శనమిస్తున్నది.
దళారుల దోపిడీ..
సర్కారు నిర్లక్ష్యంలో దళారుల పంట పండుతున్నది. ఇటీవల వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో రైతులు ధాన్యాన్ని ఎప్పటికప్పుడు అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో దళారులు నిర్ణయించిన ధరకే అమ్మాల్సి దుస్థితి ఏర్పడింది. తాము చెప్పిన ధరకు ఇస్తే తీసుకుంటామని షరతులు పెడుతున్నారు. గత్యంతరం లేక రైతులు వచ్చిన ధరకే అమ్ముకుంటున్నారు. ప్రైవేట్‌లో కేవలం క్వింటాలుకు రూ.1600 నుంచి రూ.1800 మాత్రమే పలుకుతున్నది. దీంతో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కోల్పోవాల్సి వస్తున్నది. వరి ధాన్యం క్వింటా ఏ గ్రేడ్‌కు రూ.2389, సాధారణ రకం క్వింటాకు రూ.2369 చొప్పున మద్దతు ధర ప్రకటించారు. అంటే ఒక్కో క్వింటాకు సుమారుగా రూ.500 నుంచి రూ.700 నష్టపోవాల్సి వస్తున్నది. అంతే కాకుండా 70 కిలోల బస్తాకు 3 నుంచి 5 కిలోల తరుగు తీస్తున్నారు. గుండాల మండలంలోని అనంతారంలో జోరుగా ప్రైవేట్ కాంటాలు నడుస్తున్నాయి. ఈ గ్రామంలో మూడు గ్రూపులుగా విడిపోయి జోరుగా వ్యాపారం చేస్తున్నారు. అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.