మునుగోడు, ఏప్రిల్ 1 : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టిన ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని సీపీఎం నల్లగొండ జిల్లా మునుగోడు మండల కార్యదర్శి సాగర్ల మల్లేశ్ అన్నారు. యూనివర్సిటీ భూముల వేలాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం యూనివర్సిటీ ముందు జరిగే ధర్నాకు వెళ్లకుండా సీపీఎం నాయకులను మునుగోడు పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్సిటీ విద్యార్థుల మీద, విద్యార్థి సంఘం నాయకుల మీద పోలీసుల నిర్భందాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలన్నారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరన్నారు.
విశ్వవిద్యాలయాలను, విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన దశలో రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు దుయ్యబట్టారు. విశ్వవిద్యాలయానికి కేటాయించిన భూమిని అమ్మకానికి పెట్టవద్దని, యూనివర్సిటీ అభివృద్ధికే వినియోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు మిర్యాల భరత్, యాస రాణీశ్రీను, వంటేపాక రమేశ్ పాల్గొన్నారు.