నీలగిరి, జూన్ 24: ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రాష్ట్ర ఆర్థిక ,ప్రణాళికా శాఖ కార్యదర్శి, ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక నల్గొండ జిల్లా ప్రత్యేక అధికారి గౌరవ్ ఉప్పల్ అన్నారు. బుధవారం ఆయన నల్గొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంపై కలెక్టర్ చంద్రశేఖర్‌తో కలిసి సమీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి , సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో లబ్ధిదారునికి అందుతున్నది లేనిది తెలుసుకోవడంతోపాటు, అలాగే వివిధ పథకాల అమలులో ప్రజలకు అవగాహన కల్పించి సమస్యలను తెలుసుకునేందుకు 99 రోజులపాటు ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రభుత్వ పథకాలన్ని పకడ్బందీగా అమలు చేసినప్పుడే లబ్ధి చేకూరుతుందన్నారు. జిల్లాలో ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు క్రమ పద్ధతిలో విజయవంతంగా నిర్వహించడం పట్ల ఆయన కలెక్టర్‌తో పాటు, అధికారులను అభినందించారు.
అంతకు ముందు కలెక్టర్ చంద్రశేఖర్ ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నల్గొండ జిల్లాలో 99 రోజులపాటు వివిధ అంశాల వారీగా చేపట్టిన కార్యక్రమాలను జిల్లా శాఖల అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అంతకుముందు కలెక్టర్ కార్యాలయం చేరుకున్న ప్రత్యేక అధికారికి జిల్లా కలెక్టర్‌తో పాటు, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఇతర అధికారులు స్వాగతం పలికారు. సమాచార శాఖ ఆధ్వర్యంలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం పై ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ అశోక్ రెడ్డి, ప్రణాళికా శాఖ డైరెక్టర్ షేక్ మీరా, ట్రైన్ అసిస్టెంట్ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, జెడ్పీ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, డీఆర్వో దశరథ్ ,డీఎఫ్‌వో రాజశేఖర్, సీపీవో శ్రీనివాస్ నాయక్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.