అన్నదాతపై ప్రభుత్వం కక్ష గట్టినట్లు వ్యవహరిస్తున్నది. పంటలకు సాగు నీరు ఇవ్వకుండా లక్షల ఎకరాలను ఎండబెట్టిన ప్రభుత్వం ఇప్పుడు రైతుల చేతికి వచ్చిన కొద్దిపాటి పంటలను కూడా కొనకుండా నిర్లక్ష్యం చేస్తున్నది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచినా, కొనుగోళ్లు మాత్రం మరిచింది. సూర్యాపేట జిల్లాలో 80 శాతం వరి కోతలు పూర్తయినా, ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క గింజ కూడా కొనలేదు. మరోవైపు సాగర్ ఆయకట్టులో సన్నాల కొనుగోళ్లు సైతం జీరోగానే ఉన్నాయి. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా బోనస్ మాట అటుంచితే రైతులకు కనీస మద్దతు ధర కూడా దక్కడం లేదు. ఇక్కడ మిలర్లు, దళారులు చెప్పిందే ధరగా మారింది. తరుగులు అదనం. నిన్నమొన్నటి వానలు సైతం రైతులకు నష్టం చేశాయి. వర్షాలు ఇంకా ఉన్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలోనూ ప్రభుత్వం కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
-యాదాద్రి భువనగిరి/సూర్యాపేట, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ)/నేరేడుచర్ల/మిర్యాలగూడ
యాదాద్రి భువనగిరి జిల్లాలో యాసంగి సీజన్లో 2.80లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. సుమారుగా 6.5లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పౌర సరఫరాల అధికారులు మాత్రం నాలుగున్నర లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం జిల్లాలో 372కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ప్రతిపాదించారు. కానీ, ఇప్పటి వరకు 100 కేంద్రాలను కూడా ప్రారంభించ లేదు. కొన్నిచోట్ల తూ.తూ.మంత్రంగా ప్రారంభించినా కాంటాలు వేయడం లేదు. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 600 మెట్రిక్ టన్నుల ధ్యాం మాత్రమే కొన్నారు. దాంతో కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడ పోసిన ధాన్యం అక్కడే కుప్పలుగా కనిపిస్తున్నది. దాంతో రైతులు కేంద్రాల్లోనే గడిగాపులు గాయాల్సి వస్తున్నది. మిల్లులు అలాట్మెంట్ కాలేదని, ట్యాబ్లు ఓపెన్ అవడం లేదని నిర్వాహకులు చెబుతున్నారు. దాంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యం అమ్ముకుంటున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు ధర తగ్గిస్తున్నారు. ప్రభుత్వ ధర ఏ రకం క్వింటాకు రూ.2320 ఉండగా.. 1,800 నుంచి 2వేలలోపు మాత్రమే చెల్లిస్తునారు. ఇదిచాలదన్నట్లు క్వింటాకు 5 కిలోల వరకు తరుగు తీస్తున్నారు.
గురువారం పలు చోట్ల ఈదురుగాలులతో కూడి న అకాల వర్షం కురవడంతో ధాన్యం తడిసింది. మోత్కూరు, ఆత్మకూరు (ఎం)తోపాటు పలు మండలాల్లో ధాన్యం కొట్టకుపోయింది కల్లాల వద్ద కూడా వడ్లు తడిసి ముద్దయ్యాయి. వర్షాలు ఇంకా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న ప్రభుత్వం కొనుగోళ్లు చేయకపోడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
సూర్యాపేట జిల్లాలో దాదాపు 80శాతం వరి కోతలు పూర్తి కాగా, ప్రభుత్వం గింజ ధాన్యం కూడా కొన్నది లేదు. ఈ సీజన్లో 4.07 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్న అధికార యంత్రాంగం గురువారం రాత్రి వరకు జిల్లావ్యాప్తంగా 264 కొనుగోలు కేంద్రాలను తెరిచింది. కానీ, ఇప్పటివరకూ ఎక్కడా కొనుగోళ్లు ప్రారంభించ లేదు. గోదావరి జలాలు రాకపోవడంతో జిల్లాలో దాదాపు లక్ష ఎకరాల్లో వరి పంట ఎండిపోగా, మిగిలిన పంటను సైతం మద్దతు ధరకు అమ్ముకునే పరిస్థితి లేకుండా పోయింది. కలెక్టర్ మొదలు అధికార యంత్రాంగం ప్రారంభించని కేంద్రాల చుట్టూ పర్యటిస్తూ హడావిడికి పరిమితమవడంపై రైతులు మండిపడుతున్నారు. ప్రతి యాసంగి సీజన్లో మార్చి 15 నుంచి 20 మధ్య కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తుండగా, ఈసారి మూడు వారాలు ఆలస్యం చేశారు. ఈ నెల 7 11 వరకు సెంటర్లు తెరిచినా ఇప్పటికీ కొనుగోళ్లు మాత్రం చేయడం లేదు.
మరోవైపు సాగర్ ఆయకట్టులో సన్నధాన్యం కొనుగోళ్లపైనా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. దాంతో కోత మిషన్ల ద్వారా కోసిన వడ్లను అమ్ముకునేందుకు రైతులు దళారులను ఆశ్రయించాల్సి వస్తున్నది. ఈ క్రమంలో మిల్లర్లు, దళారులు ఒక్కటై రైతులకు తక్కువ ధర చెల్లిస్తున్నారు. కొందరు మిల్లర్లు మా మిల్లు ధాన్యంతో నిండిపోయింది.. మాకు అవసరం లేదంటూ లోడ్లను తిప్పి పంపిస్తున్నారు. ఆఖరికి రూ.2,200లోపు ధర పెట్టి కొనుగోలు చేస్తున్నారు. దీనికితోడు 50 బస్తాల ధాన్యంతో వెళ్తిన బోరం లోడుకు 30 నుంచి 40 కేజీల వరకు తరుగు తీస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇదే యాసంగి పంటను ఇవే రకం సన్నాలను రూ.2,800 నుంచి 3వేల వరకు అమ్ముకున్న రైతులు ఇప్పుడు మద్దతు ధర కూడా దక్కక నష్టపోతున్నారు. అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.
సన్న ధాన్యానికి క్వింటాకు మద్దతు ధర రూ.2,320తోపాటు అదనంగా రూ.500 బోనస్ ఇప్పిస్తామని ఊదరగొట్టిన ప్రభుత్వం ఈ యాసంగి సీజన్లో ఇంతవరకు ఒక గింజ కూడా కొనుగోలు చేయలేదు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు కింద రైతులు సన్నాలే పండిస్తుండగా, నల్లగొండ జిల్లాలో సన్న ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం 23 కేంద్రాలు ప్రతిపాదించింది. వాటిల్లో 18 ప్రారంభించగా ఎక్కడా కొనుగోళ్లను ప్రారంభించలేదు. దాంతో రైతులు మిర్యాలగూడ ప్రాంతంలో ఎక్కువగా ఉన్న మిల్లులకు ధాన్యం లోడ్లు తీసుకువస్తున్నారు. ఇదే అదునుగా మిల్లర్లు సిండికేట్ అయ్యి రూ.2వేల నుంచి రూ.2,200లోపే ధర
నేను 16 ఎకరాలు కౌలుకు తీసుకుని సన్న వడ్లు పండించాను. తీరా అమ్ముకుందామంటే ప్రభుత్వం కొనుగోళ్లు ప్రారంభించ లేదు. మిల్లుల దగ్గరికి తీసుకు వస్తే పచ్చగింజ ఉందంటూ కొర్రీలు పెట్టి 2,100 రూపాయలకు కొన్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే నాలా చాలామంది రైతులు నష్టపోయేవాళ్లు కాదు.
-రామకృష్ణ, రైతు, గోదావరిగూడెం, వేములపల్లి మండలం