నల్లగొండ, డిసెంబర్ 28 : పరిపాలనా సౌలభ్యం కోసం 2017లో జిల్లాలను విభజించిన రాష్ట్ర ప్రభుత్వం.. గ్రామాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో 500 జనాభా ఉన్న గ్రామాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. దాంతో నల్లగొండ జిల్లాలో కొత్తగా 349 గ్రామపంచాయతీలు ఏర్పాటయ్యాయి. అయితే ఆయా గ్రామపంచాయతీలకు సొంత భవనాలు లేకపోవటం వల్ల ప్రైవేటు భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఆయా గ్రామపంచాయతీలకు సొంత భవనాలు నిర్మించేందుకు సర్కారు సిద్ధమైంది. అందులో భాగంగా తొలి విడుతగా 218 గ్రామాల్లో భవన నిర్మాణానికి నిధులు విడుదల చేసింది. మిగిలిన 131 గ్రామ పంచాయతీలకు వచ్చే నెలలో రెండో దఫాలో నిధులు అందనున్నాయి.
త్వరలో పనులు ప్రారంభం
కొత్త పంచాయతీల్లో భవన నిర్మాణాలు జాప్యం లేకుండా చేపట్టేలా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో భవన నిర్మాణాల కోసం రెవెన్యూశాఖ భూమి గుర్తించి పంచాయతీ రాజ్శాఖకు స్వాధీనం చేయగా.. ఆయా గ్రామాల్లో కొత్త భవనాల నిర్మాణానికి పాలకవర్గాలు ఆమోదం తెలియ చేస్తూ తీర్మానాలు కూడా చేశాయి. త్వరలో టెండర్లు పూర్తి చేసి నిర్మాణాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఒక్కో పంచాయతీకి రూ.20 లక్షలు
జిల్లా వ్యాప్తంగా తొలి విడుతలో భాగంగా 218 కొత్త గ్రామపంచాయతీలకు భవనాలు నిర్మించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో పంచాయతీ రూ.20 లక్షల చొప్పున మొత్తం రూ.43.60 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో రెండు సమావేశ మందిరాలు, సర్పంచ్, కార్యదర్శికి ప్రత్యేక గదులు, లతో పాటు వాష్ రూమ్స్ నిర్మించేలా ప్రణాలిక రూపొందించి పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగానికి పంపింది. ఇప్పటికే జిల్లాలోని కేతేపల్లి మండలం భీమారంలో ఇటీవల కొత్త పంచాయతీ భవనం నిర్మించగా ఆదే మోడల్లో మిగిలిన గ్రామాల్లో నిర్మించనున్నారు.
218 పంచాయతీలకు నిధుల విడుదల
జిల్లాలో 349 కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు కాగా అందులో తొలి విడుతలో 218 గ్రామాలకు భవనాల నిర్మానానికి ప్రభుత్వం రూ.43.60 కోట్లు విడుదల చేసింది. ఆయా పంచాయతీల్లో ఇప్పటికే భూమి గుర్తించి కొత్త భవనాల నిర్మాణం కోసం పాలక వర్గాలు తీర్మానాలు చేశాయి. దాంతో నిర్మాణ ప్రక్రియ ప్రారంభించాము. మిగిలిన 131 పంచాయతీలకు వచ్చే నెలలో నిధులు వచ్చే అవకాశం ఉంది.
–దేప విష్ణువర్ధన్‌రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ అధికారి, నల్లగొండ