నీలగిరి, అక్టోబర్ 29: రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కొనుగోలులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కలెక్టర్‌ను ప్రకటనలో కోరారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలకు విపరీతంగా ధాన్యం వచ్చిందని, కానీ కొనుగోలు మాత్రం మందకొడిగా సాగుతుందన్నారు. చాలా ప్రాంతాల్లో ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేయలేదని, ఏర్పాటు చేసిన చోట వర్షం నుంచి ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులకు కనీసం టార్బాలిన్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో అధికారులు ఉన్నారని తీవ్రంగా విమర్శించారు.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటా పెట్టే విషయంలో అధికారులు నిబంధనలు పాటించడం లేదని, 40.600 కిలోలు తూకం వేయాల్సి వుండ గా, అదనంగా ఒక కిలో(41.600 కిలోలు) కాం టా వేస్తూ, రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు వచ్చిన రైతుల ధాన్యాన్ని కాంటా వేయకుండా, కొంతమంది సిఫారసులతో ఇష్టమొచ్చినట్లు కాంటా పెడుతున్నారన్నారు. ఈ బాధలు భరించలేక తప్పని పరిస్థితుల్లో రైతులు ప్రైవేట్‌గా క్వింటా రూ.1500లకు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకొని, ధాన్యం కొనుగోలులో ఎటువంటి అక్రమాలకు తావులేకుండా సాఫీగా జరిగేటట్లు, రైతులకు న్యాయం జరిగేటట్లు చూడాలని డిమాండ్ చేశారు. మిల్లర్లు సన్న ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని. రైతులకు రూ.500 బోనస్ చెల్లించి, మిల్లర్లు సన్నధాన్యాన్ని కొనే విధంగా కలెక్టర్ ఆదేశించాలన్నారు. అదేవిధంగా రెండు పంటల నుంచి సన్నధాన్యంపై బకాయి బోనస్‌ను వెంటనే రైతులకు విడుదల చేయాలని, లేనట్లయితే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుల పక్షాన ఆందోళనలు చేపడతామని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి హెచ్చరించారు.