అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆరోగ్య మహిళ కార్యక్రమం సక్సెస్ ఫుల్‌గా కొనసాగుతున్నది. ప్రతి మంగళవారం మహిళలకు ఉచిత వైద్య పరీక్షలతోపాటు మందులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నెల 8న వైద్య సేవలు ప్రారంభం కాగా తిరిగి మంగళవారం అన్నిచోట్లా పరీక్షలు విజయవంతంగా పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 13 కేంద్రాలను ఇందుకోసం ఎంపిక చేయగా అన్ని చోట్లా 50మందికి తగ్గకుండా పరీక్షలు నిర్వహించారు. అక్కడికక్కడే స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి, వ్యాధి నిర్ధారణ చేశారు. వ్యాధుల రకాలను బట్టి అవసరమైన వాటిని జిల్లా కేంద్రాల్లోని టీ డయాగ్నోస్టిక్ కేంద్రాలకు పంపించారు. మందులు కూడా ఉచితంగా అక్కడే అందించి వైద్య సలహాలు ఇచ్చారు. ఇలా మొత్తం 659 మందికి తొలి వారం పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గతంలో ఎన్నడూ మహిళల కోసం ఇలాంటి ప్రత్యేక ఏర్పాట్లు లేవని, కేసీఆర్‌కు ప్రజల పట్ల ఉన్న ఆలోచనతోనే ఇవన్నీ సాధ్యం అవుతున్నాయంటూ పరీక్షలకు వచ్చిన మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నల్లగొండ ప్రతినిధి, మార్చి 14 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ఇప్పటికే అమలులో ఉన్నాయి. ఒంటరి మహిళా పెన్షన్ మొదలుకుని కేసీఆర్ కిట్.. గర్భిణులు, బాలింతల కోసం పౌష్టికాహారంతో కూడిన ఆరోగ్యలక్ష్మి, అమ్మ ఒడి పథకం, ఆస్పత్రులకు తీసుకొచ్చేందుకు 102 సేవలు.. ఇలా చాలా సంక్షేమ పథకాలు ప్రత్యేక శ్రద్ధతో అమలు చేస్తున్నారు. ఇవి ఇప్పటికే మంచి ప్రశంసలు పొందుతున్నాయి. తాజాగా మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ మరో కార్యక్రమాన్ని ప్రకటించారు. ఇప్పటికే అన్ని స్థాయిల్లో మెరుగైన వైద్య సేవలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు అన్ని రకాల వ్యాధులకు చికిత్స అందించేందుకు వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నది. అత్యాధునిక వైద్య సేవలను జిల్లా స్థాయిలోనే అందిస్తున్నది. ఇదే కోణంలో ముఖ్యంగా మహిళా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన ప్రభుత్వం.. ఆరోగ్య మహిళ పేరుతో వైద్య సేవలను ప్రారంభించింది. ఈ నెల 8న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఈ సేవలను ప్రారంభించారు. ఇందులో భాగంగా తొలి దఫాలో రాష్ట్ర వ్యాప్తంగా వంద పీహెచ్‌సీల్లో ఆరోగ్య మహిళా సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 13 పీహెచ్‌సీల్లో ఈ సేవలను ప్రారంభించారు. నల్లగొండ జిల్లాలో డిండి, వేములపల్లి, నిడమనూరు, కట్టంగూర్, మాన్యంచెల్క, మర్రిగూడెం పీహెచ్‌సీల్లో, సూర్యాపేట జిల్లాలో కుడకుడ, నూతనకల్, పెన్‌పహాడ్, త్రిపురవరం, నేరేడుచర్ల పీహ్చ్సీల్లో, యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్, గుండాల పీహెచ్‌సీల్లో ఆరోగ్య మహిళా సేవలు కొనసాగుతున్నాయి.
Arogya Mahila 5
ప్రత్యేక శ్రద్ధతో వైద్య సేవలు..
సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు రోజువారి పనుల్లో నిమగ్నమై తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. దీంతో ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవలి కాలంలో క్యాన్సర్ కేసుల సంఖ్య పెరుగుతున్నది. వీటితో పాటు థైరాయిడ్‌తో వచ్చే అనేక సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. మోనోపాజ్ సమస్యలపైనా అవగాహన లేమి వెంటాడుతున్నది. షుగర్, బీపీ పట్ల కూడా సరైన అవగాహన లేక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఉచితంగా వైద్య పరీక్షలు అందుబాటులోకి తెచ్చి మహిళల ఆరోగ్యాన్ని సంరక్షించాలని భావించింది. అందుకే ప్రత్యేకంగా మహిళల కోసమే సేవలు ప్రారంభించి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు అందజేస్తున్నది. దీంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పెద్ద పట్టణాల్లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉండే ఇలాంటి వైద్య సేవలను తమ ప్రాంతాల్లోనే చేస్తుండడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆరోగ్య మహిళ సేవలపై విస్తృత ప్రచారం కల్పించి ఎక్కువ మంది సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపడుతున్నట్లు నల్లగొండ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎ.కొండల్రావు తెలిపారు.
659 మందికి వైద్య పరీక్షలు
ఉమ్మడి జిల్లాలోని మొత్తం 13 కేంద్రాల్లో మంగళవారం వైద్య పరీక్షల కోసం మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఒక్కో పీహెచ్సీలో కనీసం 50 మందికి తగ్గకుండా పరీక్షలు జరుగాలని వైద్యారోగ్య శాఖ నిర్ణయించగా.. మంగళవారం 659 మందికి టెస్టులు చేశారు. డిండిలో 50 మంది, వేములపల్లిలో 50, మర్రిగూడలో 50, నిడమనూరులో 52, కట్టంగూరులో 50, మాన్యంచెల్కలో 52 మందికి పరీక్షలు చేశారు. త్రిపురవరంలో 52, కుడకుడలో 34, పెన్‌పహాడ్‌లో 52, నూతనకల్‌లో 51, నేరేడుచర్లలో 52 మంది, బీబీనగర్‌లో 52, గుండాలలో 62 మందికి పరీక్షలు జరిపి, వైద్య సేవలు అందించారు. మొత్తం ఎనిమిది రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షతో పాటు పౌష్టికాహార లోపం, యూటీఐ పరీక్ష, మోనోపాజ్ సమస్యలు, పీసీఓడీ, వంధత్వం, ఎస్టీఐ, థైరాయిడ్ వంటి ప్రధాన పరీక్షలు నిర్వహించారు. వీటితో పాటు బీపీ, షుగర్, హిమోగ్లోబిన్ వంటి పరీక్షలు కూడా చేశారు. ఎక్కువ మంది బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి సమస్యలతో రాగా.. వారికి అక్కడికక్కడే ఉచితంగా మందులు కూడా అందజేశారు. వ్యాధి నిర్ధారణ కోసం కొందరి శాంపుళ్లను జిల్లా ఆస్పత్రుల్లోని టీ డయాగ్నోస్టిక్ కేంద్రాలకు పంపారు. రెండు మూడ్రోజుల్లో ఫలితాలు వచ్చాక వారికి అవసరమైన వైద్య సేవలు అందించనున్నారు.
విస్తృత ప్రచారం చేయాలి
ఆరోగ్య మహిళా కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మంగళవారం మహిళలకు మాత్రమే చూస్తారనే విషయం ఇంకా విస్తృత పర్చాలి. అది తెలియక ఎప్పటిలాగే పురుషులు కూడా వస్తున్నారు. దవాఖానలో ఈ రోజు 50 మంది మహిళలు ఓపీ రాగా అందరికీ పరీక్షలు చేశాం. అందులో నలుగురు క్యాన్సర్‌కు సంబంధించి, మిగతా వారు పీసీఓడీ అండ్ యూటీఐ సమస్యలతో వచ్చారు. వారందరికీ పరీక్షలు చేసి అందులో 13 మంది నమునాలను టీ డయాగ్నోస్టిక్ సెంటర్‌కు పంపించాం. అక్కడి నుంచి రిపోర్టులు వచ్చిన తరువాత చికిత్స ప్రారంభిస్తాం. మిగతా వారందరికీ ఉచితంగా మందులు అందజేశాం. మహిళలు తమ సమస్యలన్నింటినీ చెప్పుకోగలిగారు. వాటికి పరిష్కార మార్గాలు సూచించాం.
– డాక్టర్ ఎజాజ్ ఈక్తియార్ సాహెదా, మెడికల్ ఆఫీసర్, నల్లగొండ
ఆడవాళ్లకు ప్రత్యేకంగా చూడడం బాగుంది
నాకు కొంతకాలంగా కడుపులో మంట వస్తున్నది. దాంతోపాటు ఇతర సమస్యలతో చాలా బాధపడుతున్నా. ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లలేని పరిస్థితి. ప్రభుత్వ దవాఖానకు వెళ్లి చెప్పుకోవాలంటే చాలా మంది ఉంటారనే భయంతో వెళ్లలేకపోయేదాన్ని. మంగళవారం ఆడవాళ్లకు మాత్రమే ప్రత్యేకంగా చూడడం వల్ల అన్ని రకాల సమస్యలు చెప్పుకొనే వీలు కలిగింది. డాక్టర్లు చాలా నిదానంగా, ప్రశాంతంగా చూసి ఉచితంగా టెస్టులు చేసి వారం రోజులకు సరిపడా మందులు ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది.
– కోమటిరెడ్డి భారతమ్మ, ఎం.దుప్పలపల్లి, నల్లగొండ మండలం
ఆరోగ్య మహిళతో ప్రతి మహిళకూ భరోసా
నిత్యం ఇంటి పనుల్లో నిమగ్నమయ్యే మహిళలు ఆరోగ్యం మీద శ్రద్ధలేక అనారోగ్యం పాలవుతున్నారు. వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ఆరోగ్య మహిళా కేంద్రం ద్వారా ప్రతి మంగళవారం ప్రత్యేకంగా మహిళల సమస్యలు తెలుసుకొని ఉచితంగా మందులు, చికిత్స అందిస్తున్నది. క్యాన్సర్‌లో పలు రకాలు ఉన్నప్పటికీ మహిళలు గుర్తించలేరు. మహిళలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వస్తే ఉచితంగా రక్త పరీక్షలు చేసి వారిలో ఉన్న రుగ్మతలను తెలియజేసి వాటిపై అవగాహన కల్పిస్తాం. సరైన సమయంలో చికిత్స అందించడానికి ఆరోగ్య మహిళా కేంద్రం తోడ్పడుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి మహిళా సద్వినియోగం చేసుకోవాలి.
– సుచిత్ర, పీహెచ్సీ వైద్యురాలు (వేములపల్లి)
వైద్య పరీక్షలు ఉచితంగానే చేసిండ్రు..
మహిళలకు మంగళవారం ప్రత్యేకంగా చూస్తున్నారని తెలిసి పీహెచ్సీ దవాఖానకు వచ్చిన. నాకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులు ఇచ్చిండ్రు. గతంలో పరీక్షలు చేసుకోవాలంటే చాలా సమయం పట్టేది. ఇంత తొందరగా చేసేవారు కాదు. అన్ని రోగాలకు సంబంధించిన పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు.. మందులు ఇస్తున్నారు. ప్రైవేటు దవాఖానలకు పోయి డబ్బులు పోగొట్టుకోవడం కంటే ఇక్కడ ఉచితంగా చూపించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఖర్చు లేకుండా అందరూ ఇక్కడికి వచ్చి ఆరోగ్య పరీక్షలు చేసుకుంటే బాగుంటుంది. ఈ సాయం అందజేస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– మహమ్మద్ షెన్ను బేగం, బీబీనగర్
ఆరోగ్య మహిళా కార్యక్రమానికి మంచి స్పందన
మహిళల సమగ్ర ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కార్యక్రమానికి మహిళల నుంచి మంచి స్పందన వస్తున్నది. కార్యక్రమానికి ముందే గ్రామాల్లో పోస్టర్లు అంటించి ఆశ వర్కర్లు, ఏఎన్ఎంల ద్వారా అవగాహన కల్పించాం. ఆరోగ్య మహిళా కార్యక్రమంలో మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, ఓరల్, సర్వైకల్, రొమ్ము క్యానర్, స్క్రీనింగ్, థైరాయిడ్‌తో పాటు మరికొన్ని పరీక్షలు చేస్తున్నాం. ఇప్పటి వరకు 112 మంది మహిళలకు పరీక్షలు చేసి మందులు ఇచ్చాం. ప్రతి మంగళవారం మహిళలకు పూర్తిస్థాయి ఆరోగ్య పరీక్షలు చేస్తాం. మహిళలు సద్వినియోగం చేసుకోవాలి.
– శ్వేత, పీహెచ్సీ వైద్యాధికారి, కట్టంగూర్
ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి
మహిళలు కుటుంబ బాధ్యతల్లో నిమగ్నమై తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టరు. ఆరోగ్య మహిళా కార్యక్రమంలో మహిళలందరూ పరీక్షలు చేయించుకుని ఆరోగ్యవంతంగా ఉండాలి. ఇక నుంచి ప్రతి మంగళవారం పీహెచ్సీలో ప్రత్యేకంగా మహిళలకు 8 రకాల పరీక్షలు చేస్తాం. ఉచితంగా మందులు అందిస్తాం. మెరుగైన వైద్యం అవసరమైన వారిని భువనగిరి ఏరియా దవాఖానకు పంపిస్తాం. మహిళలు సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలి.
– డాక్టర్ సుడుగు ప్రియాంక, ఇన్చార్జి మెడికల్ ఆఫీసర్ (బీబీనగర్)
పైసా ఖర్చు లేకుండా పరీక్షలు
రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఆరోగ్య మహిళా కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం సంతోషకరం. మా లాంటి వారికి ఒక్క పైసా ఖర్చు కాకుండా ఉచితంగా 57 రకాల వైద్య పరీక్షలు చేయడం అభినందనీయం. పరీక్ష ఫలితాలు వచ్చిన తరువాత వాటిని బట్టి మందులు రాస్తామని వైద్యాధికారి చెప్పారు. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాల అమలుతో పాటు అభివృద్ధికి కూడా పెద్దపీట వేస్తున్నారు. అన్ని విధాలుగా ఆలోచించే ముఖ్యమంత్రి ఉండడం మన అదృష్టం.
– వనజాల నీలమ్మ, నేరేడుచర్ల
మా లాంటి పేదలకు ఎంతో మేలు
రా్రష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా ఆరోగ్య పథకం మా లాంటి పేదలకు ఎంతో మేలు చేస్తుంది. పట్టణాలకు వెళ్లి ప్రైవేట్ దవాఖానలో ఆరోగ్య పరీక్షలు చేయించుకోలేని వారి కోసం ఈ పథకం పెట్టడం మా అదృష్టం. దవాఖానకు వెళ్లగానే పేరు నమోదు చేసుకొని కొద్ది సేపటి తరువాత షుగర్, ఇతర పరీక్షలు చేశారు. డాక్టరమ్మ దగ్గరికి వెళ్లగానే పరీక్షించి మందులు ఇచ్చి ఇలా వాడాలని చెప్పారు. మా లాంటి పేదల కోసం ఆలోచిస్తున్న కేసీఆర్ సార్‌కు ఎప్పుడూ రుణపడి ఉంటాం.
– చిత్తలూరి కలమ్మ, కట్టంగూర్