యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ను నీరుగార్చాలని ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా సహించమని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామ హేందర్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావుపై ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కవిత తన వ్యాఖ్యలను వెనకి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. గురువారం భువనగిరిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. హరీశ్‌రావు మొదటి నుంచి పార్టీలో కీలకంగా వ్యవహరించారని గుర్తు చేశారు.
కేసీఆర్ శిష్యుడిగా , అనుచరుడిగా ప్రయాణం సాగించారని తెలిపారు. 40 ఏండ్లుగా కష్టనష్టాల్లో, ఉద్యమం, రాజకీయాల్లో కేసీఆర్ వెంట నడిచారన్నారు. రాముడికి హనుమంతుడి మాదిరి, కేసీఆర్‌కు హరీశ్‌రావు తోడుగా ఉన్నారని గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. స్వామి భక్తితో, వినయ విధేయతలతో కేసీఆర్ అడుగులో అడుగు వేసి ప్రయాణం సాగించి, అన్నిట్లో సక్సెస్ సాధించి ట్రబుల్ షూటర్‌గా పేరొందారన్నారు. కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్, హరీశ్‌రావు సమన్వయంతో బీఆర్ఎస్ శ్రేణులమంతా పనిచేస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్పై నిందలు వేస్తే ప్రజలు హర్షించరన్నారు.
బీఆర్ఎస్ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే బీఆర్ఎస్ అని పేర్కొన్నారు. తెలంగాణ బాపు చంద్రశేఖర్‌రావు అని, ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారన్నారు. కవితకు మొదటి నుంచి పార్టీ పెట్టాలని, బీఆర్ఎస్ను విచ్ఛిన్నం చేయాలనే ఆలోచన ఉందన్నారు. బంజారాహిల్స్‌లో ఉన్న విల్లా కొన్ని కంపెనీల పేరుపై ఉందన్న ప్రచారం అందరికీ తెలుసని, కాంగ్రెస్, టీడీపీ నేతలతో బిజినెస్ చేశారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీ కుట్రలు చేస్తూ..బీఆర్ఎస్ పార్టీని అణచివేయాలని చూస్తున్నారని, ఇలాంటి సమయంలో కవిత ఆరోపణలు సరికాదన్నారు. సమావేశంలో భువనగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, బీఆర్ఎస్ నేత జడల యశీల్ గౌడ్ ఉన్నారు.