యాసంగిలో సాగు చేసిన పంటలకు నీటి తడులు అందించలేక అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. చేతికి వస్తుందన్న పంట కండ్ల ముందే ఎండిపోతుండడంతో రైతులకు భంగపాటు తప్పడం లేదు. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటగా, బోర్లలో నీళ్లు లేక, ఎస్సారెస్పీ కాల్వల ద్వారా సాగు నీరు రాక రైతులు గోస పడుతున్నారు. రైతు భరోసా ఇవ్వక పంట పెట్టుబడులకు వ్యాపారుల దగ్గర అప్పులు తెచ్చినా, పెట్టిన పెట్టుబడులు సైతం రాక దుర్భర పరిస్థితిలో రైతన్నలు ఉన్నారు.
నూతనకల్ మండలంలో ఈ యాసంగిలో మొత్తం 12,087 ఎకరాల్లో వరి సాగు చేశారు. సన్న వడ్లు 1,575 ఎకరాల్లో, దొడ్డు వడ్లు 10512 ఎకరాల్లో వేసినట్లు అధికారులు తెలిపారు. మండల పరిధిలోని మాచనపల్లి, లింగంపల్లి, నూతనకల్, ఎర్రపహాడ్, దిర్శనపల్లి, చిల్పకుంట్ల, మిర్యాల, అల్గునూరు గ్రామాల్లో సుమారు 300 ఎకరాల్లో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. పొట్ట దశలో ఉన్న వరి ఎండిపోతుండడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. చేసేదేమీ లేక పశువులు, గొర్రెలు, మేకలకు మేతగా వదిలేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పూర్తి స్థాయిలో గోదావరి జలాలు విడుదల చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
నాకు ఊరి శివారులో మూడు ఎకరాల భూమి ఉంది. 60 వేల రూపాయల పెట్టుబడి పెట్టి వరి సాగు చేసిన. పొలం పొట్ట దశలోకి వచ్చింది. బోరు సరిగా పొయ్యడం లేదు. పొలంఎండి పోతున్నది. గత ప్రభుత్వంలో ఎస్సారెస్పీ కాల్వల నీరు వచ్చి చెరువు నిండి నీళ్లకు ఇబ్బంది లేకుండె. బోర్లు, బావుల్లో పుష్కలంగా నీళ్లు ఉండేవి. వ్యవసాయం మంచిగా చేసుకున్నాం. కానీ ఇప్పుడు కాల్వల ద్వారా నీళ్లు వదలక పొలాలు ఎండి పోతున్నాయి. సర్కారు ఆదుకోవాలి. 20 రోజలు పొలానికి నీళ్లు లేక కండ్ల ముందే ఎండుతుంటే చూడ బుద్ధి కావడం లేదు.