కట్టంగూర్, అక్టోబర్ 06 : విద్యార్థులు పాఠశాల స్థాయిలోనే లక్ష్యాలను ఏర్పచుకుని పట్టుదల, క్రమశిక్షణతో విద్యనభ్యసించాలని ఇంపాక్ట్ మోటివేషనల్ ట్రైనర్ దెందె ప్రవీణ్ కుమార్ అన్నారు. సోమవారం కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ అఫ్ కట్టంగూర్ కింగ్స్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన యువ వికాస్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు ప్రతి సబ్జెక్ట్ ను నిత్య సాధన చేయడంతో మంచి ఫలితాలు సాధిస్తారని తెలిపారు. దేశ భవిష్యత్ యువత చేతుల్లో ఉందని ఉన్నత శిఖరాలకు చేరుకుని దేశానికి సేవ చేయాలని సూచించారు.
పఠనం, క్రీడలు, సేవా కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి యువ వికాసలో భాగమేనన్నారు. విద్యార్థులు విద్యా నైపుణ్యాలను పెంపొందించుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. సామాజిక ఎదుగుదలకు యువ వికాస కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ అంబటి అంజయ్య, లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు రెడ్డిపల్లి సాగర్, కల్లూరి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి గుడిపాటి శివప్రసాద్, కోశాధికారి పోగుల రాములు, ఉపాధ్యాయులు కొంక అంథోని, చిన్ని శ్రీనివాస్, విఠల్, ఎండీ.అబ్దుల్ గఫార్ పాల్గొన్నారు.