– సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట టీయుడబ్ల్యుజె(హెచ్-143) ఆధ్వర్యంలో జర్నలిస్టుల ధర్నా
సూర్యాపేట, డిసెంబర్ 27 : జర్నలిస్టుల అక్రిడిటేషన్ల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 252 అసంబద్ధమైందని, దాన్ని వ్యతిరేకిస్తూ టీయూడబ్ల్యూజే(హెచ్-143) ఆధ్వర్యంలో శనివారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీయుడబ్ల్యుజె(హెచ్-143) జిల్లా అధ్యక్షుడు వజే వీరయ్య, రాష్ట్ర నాయకుడు గుండా శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల అక్రిడిటేషన్ల గడువు ముగిసిన రెండేండ్ల తర్వాత నూతన నిబందనల పేరుతో తీసుకొచ్చిన జీఓ 252 జర్నలిస్టుల హక్కులను కాలరాసేలా ఉందన్నారు. జర్నలిస్టులకు అన్యాయం చేసేలా జీఓ తీసుకురావడాన్ని టీయూడబ్ల్యూజేహెచ్ 143 తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. గతంలో డెస్క్ జర్నలిస్టులు, సాధారణ జర్నలిస్టులు అందరికి ఒకేలా ఉన్న అక్రిడేషన్ కార్డు స్థానంలో తాజాగా డెస్క్ జర్నలిస్టులకు మీడియా కార్డు, సాధారణ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డు పేరిట జర్నలిస్టులను విభజిస్తూ, వారి హక్కులను కాలరాసేలా నూతన జీఓ ఉందన్నారు.
ఏ కార్డుతో ఏ ప్రయోజనం ఉంటుందో స్పష్టత ఇవ్వకపోవడం, గతంలో ఉన్న సంఖ్య కంటే తక్కువగా తాజా జీఓ ద్వారా అక్రిడేషన్ కార్డులను కుదించే ప్రయత్నం చేస్తూ అయోమయంగా ఉన్న జీఓ 252ను జర్నలిస్టులకు ప్రయోజనకరంగా ఉండేలా సవరించాలన్నారు. జీఓ సవరించే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి హరికిషన్, సీనియర్ జర్నలిస్టులు శేఖర్, శ్యామ్ సుందర్‌రెడ్డి, నాగేందర్, దేవరగట్ల సతీశ్, సురేశ్, నాగరాజు, పి.సైదిరెడ్డి, గోవర్ధన్, మహేశ్, బ్రహ్మచారి, ఎడ్వర్డ్, చందన్, ప్రవీణ్, యాకయ్య, ఫణీంద్ర, పురుషోత్తం, వీరన్న, శ్రావణ్, శంకర్, రామాచారి, వెంకటేశ్, శ్రీనివాస్, సురేశ్, బాలు పాల్గొన్నారు.

Suryapet : ‘జీఓ 252 అసంబద్ధమైంది.. వెంటనే సవరించాలి’