– నల్లగొండ జిల్లా వ్యాప్తంగా చలో అసెంబ్లీకి తరలిన రిటైర్డ్ ఉద్యోగ, ఉపాధ్యాయులు
– ఎక్కడికెక్కడ అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలింపు
రామగిరి, జనవరి 05 : వివిధ శాఖలో ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమకు న్యాయంగా రావాల్సిన బెనిఫిట్స్‌ను ప్రభుత్వం తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా నుండి సోమవారం అసెంబ్లీ ముట్టడికి వెళ్లారు. అయితే జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఉద్యోగులను పోలీసులు ముందస్తుగానే అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. మార్చి2024 తర్వాత ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ న్యాయమైన ఉద్యోగ విరమణ బెనిఫిట్స్ ను చెల్లించాలని ప్రభుత్వానికి పలు పర్యాయాలు మొరపెట్టుకున్నట్లు తెలిపారు. అయినా స్పందించక పోవడంతో రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర మనోవేదనతో అసెంబ్లీ ముట్టడికి బయల్దేరినట్లు చెప్పారు.
బక్క జడ్సన్‌తో పాటు వివిధ జిల్లాల నుండి వచ్చిన రిటైర్డ్ ఉద్యోగ, ఉపాధ్యాయులను అరెస్టు చేసి బేగంపేట పోలీసు స్టేషన్‌కు తరలించి నిర్భందిచారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమకు రావాల్సిన పెన్షన్ బకాయాలను వెంటనే ఏక మొత్తంలో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టు అయిన వారిలో నల్లగొండ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ బాధ్యులు కొంపెల్లి భిక్షపతి, ఎస్.రామకృష్ణారెడ్డి, ఓరుగంటి శ్రీనివాస్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కాటబత్తుల గణేశ్, ఎస్.రాములు, ఎం.రఘు, ఎం.లింగయ్యతో పాటు 80 మంది జిల్లా రిటైర్డ్ ఉద్యోగ, ఉపాధ్యాయులున్నారు.