చివ్వేంల, మార్చి11 : బాలికలను చదివించాలని వారి రక్షణ కోసం మరింత జాగ్రత్త వహించాలని మహిళా సాధికారత సూర్యాపేట జిల్లా కోఆర్డినేటర్ చైతన్య అన్నారు. మంగళవారం చివ్వెంల మండలం వట్టిఖమ్మంపహాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో భేటీ బచావో భేటీ పడవో అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. పిల్లలపై సోషల్ మీడియా వల్ల జరిగే నష్టాలు, చదువుకోవడం వల్ల కలిగే ప్రయోజనం, సేఫ్ టచ్ అన్ సేఫ్ టచ్ వంటి విషయాల గురించి అవగాహన కలిగించారు.
18 సంవత్సరాల లోపు పిల్లలని పనిలో పెట్టుకోవడం, చైల్డ్ లైన్ నంబర్ 1098, మానవ అక్రమ రవాణా, చైల్డ్ మ్యారేజ్, సఖి సెంటర్, 181తో మహిళలకు కలిగే ప్రయోజనాలు, 104567 టోల్ ఫ్రీ నబర్ ద్వారా వృద్ధులకు కలిగే ప్రయోజనాలను ఈ సందర్భంగా ఆమె వివరించారు. మహిళా సమస్యలపై, మహిళలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఫైనాన్షియల్ స్కీమ్స్ గురించి, అలాగే పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నివారణకు అనుసరించాల్సిన విధానాల గురించి వివరించారు. ఈ సందర్భంగా 9, 10వ తరగతి బాలికలకు భేటీ బచావో భేటీ పడవో లోగో కలిగిన ఫ్లాంక్స్ (స్టడీ పాడ్స్ ) పాటు 9వ తరగతి బాలికలకు శానిటరీ పాడ్స్ అందించారు. ఈ కార్యక్రమంలో జెండర్ స్పెషలిస్ట్ రేవతి, వినోద్ అసిస్టెంట్ అకౌంటెంట్ క్రాంతి కుమార్, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, ఉపాధ్యాయలు పాల్గొన్నారు.