విజ్ఞాన భాండాగారాలైన గ్రంథాలయాల పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో ఎలా ఉండేదో తెలియంది కాదు. బూజు పట్టిన ర్యాకులు, విరిగిన కుర్చీలు, చిరిగిన పుస్తకాలు, ఉద్యోగార్థులకు మచ్చుకైనా కనిపించని పోటీ పరీక్షల మెటీరియల్, కనీస వసతుల్లేక పాఠకులు, విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యేవారు. అలాంటి గ్రంథాలయాలను స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు తీర్చిదిద్దుతున్నది.
సకల సౌలత్లు సమకూర్చి కొత్త కళను తీసుకొస్తున్నది. జనరల్ నాలెడ్జ్ పుస్తకాలతోపాటు పోటీ పరీక్షల మెటీరియల్‌ను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతున్నది. ఇప్పటికే సూర్యాపేట జిల్లాలో రూ.2.35కోట్లతో శాఖా గ్రంథాలయాల భవనాలను నిర్మించగా,జిల్లా గ్రంథాలయం అధునాతన భవనానికి రూ.3కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీన్ని డిజిటల్ లైబ్రరీగా మార్చనున్నారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లోనూ 30 పబ్లిక్ లైబర్రీలు అందుబాటులోకి రాబోతుండడం విశేషం.
సూర్యాపేట, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో గ్రంథాలయాల్లో అవసరమయ్యే పుస్తకాలు అందుబాటులో ఉండేది కాదు. కనీసం కూర్చునేందుకు కూర్చీలు సైతం లేకపోయేవి. తెలంగాణ రాష్ట్రం వచ్చాక గ్రంథాలయాలు పూర్వవైభవం సంతరించుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక దృష్టితో విజ్ఞాన సోపానాలుగా మారుతున్నాయి. పోటీ పరీక్షల మెటీరియల్, జనరల్ నాలెడ్జికి సంబంధించిన అనేక పుస్తకాలు అందుబాటులోకి వచ్చి స్టడీ సెంటర్లుగా రూపాంతరం చెందుతున్నాయి.
ఈ క్రమంలో సూర్యాపేట జిల్లా గ్రంథాలయానికి అధునాతన భవనం సమకూరి డిజిటల్ లైబ్రరీగా రూపాంతరం చెందనుంది. మూడు శాఖా గ్రంథాలయాల భవనాలు నిర్మాణం అవుతున్నాయి. గ్రామాల్లో 30 ప్రజా గ్రంథాలయాలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇందుకోసం జిల్లా మినరల్ ఫండ్, ఎమ్మెల్యేల స్పెషల్ డెవలప్మెంట్ నిధులతోపాటు జిల్లా గ్రంథాలయ సంస్థ నిధులు దాదాపు రూ.2.35కోట్లు వినియోగిస్తున్నారు.
సమైక్య రాష్ట్రంలో సూర్యాపేట పట్టణంలో ఒక గ్రంథాలయంతోపాటు జిల్లా పరిధిలో 18 శాఖా గ్రంథాలయాలు ఉన్నాయి. అత్యంత దైన్య స్థితిలో ఉన్న ఈ గ్రంథాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా భవనాలను నిర్మించి స్టడీ సెంటర్లుగా తీర్చిదిద్దుతున్నది. ఇప్పటికే చందుపట్ల, తుమ్మల పెన్‌పహాడ్, యండ్లపల్లి, కాసరబాద, తాళ్లకాంపౌండ్తోపాటు మరో రెండు చోట్ల సుమారు రూ.85లక్షలతో శాఖా గ్రంథాలయాలను నిర్మించారు. చారిత్రాత్మకమైన సూర్యాపేట జిల్లా గ్రంథాలయానికి త్వరలోనే రూ.3 కోట్లు వెచ్చిస్తామని మంత్రి జగదీశ్‌రెడ్డి హామీ ఇచ్చిన విషయం విదితమే.
ఈ మేరకు ఇప్పటికే నూతన భవన నిర్మాణం, అధునాతన టెక్నాలజీతో డిజిటల్ లైబ్రరీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే 10 గుంటల స్థల సేకరణ పూర్తయింది. జిల్లాలో 23 మండలాలకుగాను 18 శాఖా గ్రంథాలయాలు పాతవి ఉండగా.. మరో ఐదు కొత్త మండలాలకు మంజూరయ్యాయి. చివ్వెంల, పెన్‌పహాడ్, ఆత్మకూర్.ఎస్ మండలాల్లో గ్రంథాలయ భవన నిర్మాణానికి రూ.15లక్షల చొప్పున మంజూరు కాగా.. దాదాపు పనులు పూర్తయ్యాయి. ప్రారంభోత్సవాలకు సిద్ధమవుతున్నాయి. హుజూర్‌నగర్‌లో కోటి రూపాయలతో, చిలుకూరులో రూ.50 లక్షలతో భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
త్వరలోనే 30 విలేజ్ లైబ్రరీలు
గ్రంథాలయాలను పల్లెలకు విస్తరించాలనే ఉద్దేశంతో ఉన్న ప్రభుత్వం.. తొలి విడుతగా 30 చోట్ల పల్లె గ్రంథాలయాలు మంజూరు చేసింది. ఇవి త్వరలో ప్రారంభం కానుండగా.. తదనంతరం మరో 60 ప్రారంభించనున్నారు. ఒక్కో గ్రంథాయానికి రూ.1.50 లక్షల చొప్పున వెచ్చించి రీడింగ్ రూమ్‌లు, పుస్తకాలు, ఫర్నిచర్ సమకూర్చనున్నారు. ఇందుకోసం ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల స్పెషల్ డెవలప్మెంట్, మినరల్ ఫండ్, సీఎం హామీ నిధులను వినియోగిస్తారు. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల చేతుల మీదుగా గ్రామ గ్రంథాలయాలను ప్రారంభించనున్నారు.
విజ్ఞాన భాండాగారాలుగా తీర్చిదిద్దుతున్నాం
జిల్లాలోని గ్రంథాలయాలను విజ్ఞాన భాండాగారాలుగా తీర్చిదిద్దుతున్నాం. మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో గ్రంథాలయాలకు పక్కా భవనాలను నిర్మిస్తున్నాం. గ్రంథాలయాల్లో సకల సదుపాయాలు, దిన పత్రికలతోపాటు అన్ని రకాల పుస్తకాలు అందుబాటులోకి వస్తున్నాయి. మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో రీడింగ్ రూమ్‌లను పెంచడంతోపాటు మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం. ఇక్కడ రీడర్ల కోసం రోజూ ఉచితంగా భోజనం కూడా అందిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా తొలి విడుతగా ఏర్పాటు చేస్తున్న గ్రామ గ్రంథాలయాలు ఈ నెలాఖరులోపు ఎమ్మెల్యేల చేతుల మీదుగా ప్రారంభమవుతాయి. వాటి నిర్వహణకు ప్రతి నెలా రూ.2వేలు అందజేస్తాం.
– నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, సూర్యాపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్
డిమాండ్ రిజిస్టర్‌తో సత్వరమే సదుపాయాలు
గ్రంథాలయాల్లో పుస్తకాలతోపాటు ఇతర సదుపాయాలు లేకుంటే సత్వరమే సమకూర్చేందుకు ప్రతి లైబ్రరీలో డిమాండ్ రిజిస్టర్‌ను అందుబాటులో ఉంచారు. ఈ రిజిస్టర్లో ఫిర్యాదు చేస్తే చాలు.. పుస్తకాలు, కుర్చీలు, రీడింగ్ ప్యాడ్స్ ఏవి కావాలన్నా.. వెంటనే ఏర్పాటు చేస్తారు. ఇన్నాళ్లుగా చాలా మంది పోటీ పరీక్షల కోసం పట్టణాలకు పోయి కోచింగ్ సెంటర్లలో జాయిన్ అయ్యేవారు. ప్రస్తుతం స్థానికంగానే గ్రంథాలయాలు అన్ని రకాల మెటీరియల్స్‌ను అందిస్తుండడంతో నిరుద్యోగులు లైబ్రరీల వైపు చూస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ యువత, ఉద్యోగార్థులకు ప్రస్తుతం విస్తరించిన గ్రంథాలయాలతో ఎంతో మేలు చేకూరనున్నది.