గట్టుప్పల్, డిసెంబర్ 27 : గట్టుప్పల్ నుండి పుట్టపాక వరకు ఉన్న రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని మాజీ జడ్పిటిసి కర్నాటి వెంకటేశం శనివారం ఓ ప్రకటనలో కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సహకారంతో రూ.1.39 కోట్లు పంచాయతీరాజ్ నిధుల నుండి మంజూరైనట్లు తెలిపారు. గట్టుప్పల్ నుండి పుట్టపాక, తెరట్పల్లి నుండి నామపురం, కొండాపురం నుండి కొంపెల్లి రోడ్లకు ఒకే ప్యాకేజీలో శశాంక్ కు కాంట్రాక్టు ఇచ్చినట్లు వెల్లడించారు. కానీ గట్టుపల్- పుట్టపాక రోడ్డును పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నట్లు తెలిపారు. ఈ రోడ్డును ఆర్.అండ్.బీ కి మార్చే ప్రయత్నం చేస్తున్నారని గత కొన్ని నెలలుగా ఊహగానాలు వస్తున్నాయే తప్పా మార్చే ప్రయత్నం చేయడం లేదని విమర్శించారు. స్థానిక నాయకులు చొరవ తీసుకుని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, రోడ్డు పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.