సూర్యాపేట, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ) ; ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఊదరగొట్టిన హామీల్లో గ్యాస్ సబ్సిడీ ఒకటి. తాము అధికారంలోకి వస్తే గృహ వినియోగానికి సంబంధించి ప్రతి గ్యాస్ సిలిండర్‌కు రూ.500 సబ్సిడీని ఇస్తామని రేవంత్‌రెడ్డి సహా ఆ పార్టీ నేతలంతా ఊరూరా ప్రచారం చేశారు. తీరా పాలనా పగ్గాలు చేపట్టాక అభయహస్తం పేరిట ఒకటి రెండు సిలిండర్లకే పరిమితం చేసి చేతులు దులుపుకొన్నారు. ఐదు నెలలుగా సిలిండర్ల సబ్సిడీ అందడం లేదని వినియోగదారులు వాపోతున్నారు.
కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన పథకాల్లో మరొకటి మాయమవుతున్నది. ఆరు గ్యారెంటీలు, అనేక హామీలు ఇవ్వగా, అధికారంలోకి వచ్చిన తరువాత ఒకటీఅరా ప్రారంభించి వాటికి కూడా మధ్యలోనే మంగళం పాడుతున్నది. తాజాగా గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు మహాలక్ష్మి పథకం పేరిట అమలు చేస్తామన్న సబ్సిడీని అందించడం లేదు. సిలిండర్ రూ.500 సబ్సిడీ చొప్పున అకౌంట్లో వేస్తామని చెప్పి ఇప్పుడు మొహం చాటేస్తున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 12.94 లక్షల కనెక్షన్లు ఉండగా, దాదాపు ఐదు నెలలుగా సబ్సిడీ అందడం లేదు. నల్లగొండ జిల్లాలో 6.18 లక్షలు, సూర్యాపేటలో 4.24 లక్షలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 2.52 లక్షలు ఉన్నాయి.
వాటిల్లో సగం మందికి కూడా సబ్సిడీ అందుతున్న దాఖలాలు లేవు. సూర్యాపేట జిల్లాలో ఏడాది కాలంలో సగటున తక్కువలో తక్కువ ఒక్కో కనెక్షన్‌కు నాలుగు సిలిండర్లు తీసుకున్నా 16.96 లక్షల సిలిండర్లు వినియోగం జరిగినట్లు పౌర సరఫరాల శాఖ అధికారుల అంచనాలే చెప్తున్నాయి. ఆ లెక్కన సిలిండర్ ఒక్కంటికి రూ.500 చొప్పున ఇప్పటి వరకు జిల్లా ప్రజలకు 84.80 కోట్ల రూపాయలు సబ్సిడీ రూపంలో అందాల్సి ఉంది. కాగా, 13 నెలల కాలంలో జిల్లాలో 4,61,714 సిలిండర్లకు 13.23 కోట్లు మాత్రమే అందడం గమనార్హం. హామీల్లో భాగంగా కాంగ్రెస్ అరకొరగా అమలు చేసిన పథకాల జాబితాలో మహాలక్ష్మి గ్యాస్ పథకం కూడా చేరింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ఇలా మోసం చేస్తుండగా, మరోవైపు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్‌పై 50రూపాయలు పెంచి అదనపు భారం మోపుతున్నది. పెంచిన ధరలు తగ్గించాలని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిత్యం ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.
గ్యాస్ సబ్సిడీ ఎన్నడూ రాలేదు
ఎన్నికల కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన గ్యాస్ సబ్సిడీ మాకు ఇంతవరకు అందనే లేదు. ఏడాదిన్నరలో ఒక్కసారి కూడా సబ్సిడీ పడలేదు. సిలిండర్ ధరలు బాగా పెరిగిన క్రమంలో సబ్సిడీ కొంత ఊరట ఇస్తుందని అనుకున్నాం. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాకు మొండిచెయ్యే చూపింది. ఇప్పటికైనా ఇచ్చిన హామీ మేరకు సబ్సిడీ అందించాలి.
-నీరజ, గృహిణి, మఠంపల్లి
మూడు సిలిండర్లు నింపినా సబ్సిడీ పడలేదు
కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ సిలిండర్‌పై ఇస్తామన్న500 రూపాయల సబ్సిడీ మా అకౌంట్లో పడడం లేదు. ఇప్పటి వరకు మూడుసార్లు సిలిండర్ నింపించినా ఒక్కసారి కూడా సబ్సిడీ డబ్బులు జమ కాలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా సబ్సిడీపై సిలిండర్లు అందించాలి.
–కొండగడుపుల లక్ష్మి, గృహిణి, తుంగతుర్తి