మిర్యాలగూడ, సెప్టెంబర్ 5 : నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద ఉన్న మేజర్ల ద్వారా సాగునీరు చివరి భూములకు చేరక రైతులు ఇంతకాలం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరుణుడు కరుణించడంతో మేజర్ల కింద చివరి భూములకు నీరు చేరింది. రైతులు సంతోషంగా దుక్కులు దున్ని నాట్లకు సిద్ధం చేసుకున్నారు. ఈ దశలో నడిగూడెం వద్ద సాగర్ ఎడమ కాల్వకు గండి పడడంతో నీటి విడుదల నిలిపివేశారు. దాంతో మేజర్ల కింద చివరి భూముల రైతుల పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. గండి పూడ్చే వరకు మరో వారం రోజులుపైనే పట్టే అవకాశం ఉన్నందున దుక్కులు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రైతులే పూడిక తీయించుకున్నారు..
మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలో వజీరాబాద్, ముల్కలకాల్వ కిష్టాపురం, చిల్లాపురం, తడకమళ్ల, తక్కెళ్లపాడు, యాద్గార్పల్లి సాగర్ ఎడమ కాల్వ మేజర్ కాల్వలకు ప్రభుత్వం పూడికలు తీయించకపోవడంతో రైతులే సొంతంగా తీయించుకున్నారు. సాగర్ నుంచి నీటి విడుదలతో చివరి భూములకు సాగునీరు అందుతుందని ఆశించారు. కానీ మళ్లీ గండి పడడంతో నిరాశే మిగిలింది.
ఎన్ఎస్పీ అధికారుల నిర్లక్ష్యంతోనే గండ్లు
సాగర్ ఎడమ కాల్వ కట్టలను పర్యవేక్షించేందుకు కిలోమీటర్ల వారీగా పలువురు అధికారులు తరుచుగా మానిటరింగ్ చేస్తుంటారు. కాల్వకు గండ్లు పడే పరిస్థితి ఉన్న దశలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎన్ఎస్పీ అధికారులు నిర్లక్ష్యంగా ఉండడంతోనే కాల్వలకు గండ్లు పడుతున్నాయని రైతులు మండిపడుతున్నారు. గతేడాది కూడా నిడమనూరు వద్ద ఎడమ కాల్వకు గండి పడి రైతులు ఇబ్బందులు పడ్డారు.
తడకమళ్ల వరకు నీళ్లిచ్చే అవకాశం
నడిగూడెం వద్ద గండి పడడంతో ప్రస్తుతం సాగర్ ఎడమ కాల్వకు నీటిని బంద్ చేశారు. ఈ దశలో మిర్యాలగూడ మండలం తడకమళ్ల హెడ్ రెగ్యులేటర్ల వరకు సాగునీరు అందించే పరిస్థితి ఉందని, హెడ్ రెగ్యులేటర్లను కిందికి దింపి నీటిని విడుదల చేసినట్లయితే పంటలకు ప్రయోజనం చేకూరుతుందని రైతులు కోరుతున్నారు.