నీలగిరి, జూన్ 11 : రాష్ట్ర పరిధిలోని వివిధ జిల్లాలలో వరుసగా ట్రాన్స్ఫార్మర్లలోని కాపర్ వైర్, ఆయిల్ దొంగతనాలకు పాల్పడుతున్న గ్యాంగ్ లీడర్ హమీద్ హుస్సేన్, అతడి గ్యాంగ్ (రోహింగ్య) ఐదుగురు సభ్యులను నార్కట్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 12 నేరాలకు పాల్పడిన ముఠా సభ్యులు వద్ద నుండి రూ.2 లక్షల విలువగల 03 బైకులు, రూ.7,71,000/నగదు, 02 కట్టర్లు, 04 పానాలు, హ్యాండ్ గ్లౌజెస్ ను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను నల్లగొండ డీఎస్పీ కె.శివరాం రెడ్డి గురువారం వెల్లడించారు. జిల్లాలో ఇటీవల కాలంలో పెరుగుతున్న ట్రాన్స్ఫార్మర్లలోని కాపర్ వైర్, ఆయిల్, అల్యూమినియం వైర్ దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు నార్కట్‌పల్లి పోలీసులు నిఘా నిర్వహించి నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.
నిందితులను హైదరాబాద్‌కు చెందిన హమీద్ హుస్సేన్, జహంగీర్ ఆలం, నూర్ కాసిమ్, నూరుల్ అమీన్, నూరుల్ ఆలం గా గుర్తించారు. మూసివేసిన కంపెనీలు, గ్రామాలకు దూరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లను గుర్తించి రాత్రి సమయంలో ఆటోలను అద్దెకు మాట్లాడుకుని వెళ్లి, పానాలు, కట్టర్ల సహాయంతో ట్రాన్స్ఫార్మర్లను కట్ చేసి వాటిలోని ఆయిల్, కాపర్ వైర్, ఇతర వస్తువులను దొంగిలించి ఆటోలో తీసుకెళ్లి గుర్తు తెలియని వ్యక్తులకు అమ్ముకుని, వచ్చిన డబ్బులను అందరూ సమానంగా పంచుకుని జల్సాలు చేసేవారుగా పోలీసులు తెలిపారు. కేసును డీఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో సమర్థవంతంగా ఛేదించి నిందితులను అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించిన సీసీఎస్ ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి, నార్కట్‌పల్లి సీఐ నాగరాజు, ఎస్ఐ సతీష్ వర్మ, ఎస్ఐ విష్ణుమూర్తి, హెడ్ కానిస్టేబుళ్లు విష్ణువర్ధన్ గిరి, పుష్పగిరి, వహీద్ పాషా, కానిస్టేబుళ్లు అస్రార్, శివరాజ్, నరేష్, జునేద్, కమల్ కిశోర్‌లను జిల్లా ఎస్పీ అభినందించారు.