నకిరేకల్, సెప్టెంబర్ 01 : గణేష్ మండపాల నిర్వాహకులు మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. సోమవారం నకిరేకల్‌లోని పలు వినాయక మండపాలను ఆయన సందర్శించి మాట్లాడారు. నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. నిమజ్జనానికి పోలీస్ యంత్రాంగం అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ప్రజలకు, వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఏమైనా అనుకోని సంఘటనలు జరిగితే తక్షణమే పోలీస్ వారికి సమాచారం అందించాలని పేర్కొన్నారు. ఎస్పీ వెంట నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, ఎస్బీ సీఐ రాము, నల్లగొండ 1 టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి ఉన్నారు.