తిరుమలగిరి, ఏప్రిల్ 15 : ప్రజల గుండెల్లో కేసీఆర్ గూడు కట్టుకున్నారని, ప్రతి రైతు మనస్సులో ఆయన ఉన్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఉద్యమ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రజలకు ఎన్నో చేశారని, నేడు ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఆయనను తలచుకుంటున్నారని తెలిపారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలకు మేలు జరిగిందని, కేసీఆర్‌తోనే తమ బతుకులు బాగుపడుతాయని జనం నమ్ముతున్నారని చెప్పారు.
ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతానికి మంగళవారం తిరుమలగిరి మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో వ్యవసాయంతోపాటు అన్ని రంగాలకు నిరంతరం నాణ్యమైన కరెంట్ ఇచ్చామని, కానీ ఇప్పుడు ఎందుకు ఇవ్వలేక పోతున్నారని అన్నారు. కరెంట్ కొంటే పైసలు అవుతాయని, కమీషన్ రాదని, అందుకే సక్రమంగా ఇవ్వడం లేదని విమర్శించారు. కేసీఆర్ అమలు చేసిన పథకాలను ఇప్పుడు ఎందుకు కొనసాగించడం లేదని ప్రశ్నించారు.
కేసీఆర్ ఎంతో కష్టపడి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని, దాని ద్వారా రెండు పంటలకు సాగునీరు ఇచ్చి తుంగుతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో బీడు భూములను సస్యశ్యామలం చేశారని తెలిపారు. కానీ ఇప్పుడు కాళేశ్వరం నీళ్లు రాక పంటలు ఎండబెట్టారని మండిపడ్డారు. ప్రస్తుతం ప్రభుత్వ దవాఖానల పరిస్థితి దారుణంగా ఉందని, సరైన మందులు లేవని, వైద్య పరీక్షలు నిర్వహించడం లేదని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో గురుకులాలను కార్పొరేటుకు దీటుగా తీర్చిదిద్దితే నేడు అధ్వానంగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల్లో తిరుగుబాటు మొదలైతే పోలీస్, మిలటరీ ఎవ్వరూ ఆపలేరని హెచ్చరించారు. పదేండ్ల పాలనలో అందిన ఫలాలనే ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని, ఈ సారి వరంగల్‌లో జరిగే రజతోత్సవ సభకు స్వచ్ఛందంగా రావాలనే ఆలోచనతో ఉన్నారని తెలిపారు. ఈ సమావేశంలో సూర్యాపేట జడ్పీ మాజీ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగంధర్‌రావు, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య, రాష్ట్ర నాయకులు ఒంటెద్దు నరసింహారెడ్డి, చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రఘునందన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పాలనలో కొత్త పథకాలు అమలు కావడం లేదు. గతంలో చేపట్టిన పనులకే మళ్లీ శంకుస్థాపనలు చేస్తున్నారు.
బీఆర్ఎస్ హయాంలో గ్రామాలు, పట్టణాలు ఎంతో ప్రగతి సాధించాయి. ప్రజలు సంతోషంగా జీవనం సాగించారు. కాంగ్రెస్‌తో మళ్లీ అథోగతి పాలైంది. రజతోత్సవ సభకు జనం పెద్ద ఎత్తున తరలిరావాలి. ప్రజా సామ్యాన్ని పక్కదోవ పట్టిస్తున్న కాంగ్రెస్‌కు కేసీఆర్ వరంగల్ సభ ద్వారా దిశానిర్దేశం చేయనున్నారు.
– బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు
వెనుకబాటుకు గురైన తుంగతుర్తిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్దే. కాళేశ్వరం నీటితో బీడు భూముల్లో సైతం సిరుల పంటలు పండాయి. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు సమస్యలు వచ్చాయి. ధాన్యానికి మద్దతు ధర రాక రైతులు నష్టపోతున్నారు. సన్న వడ్లకు బోనస్ కూడా లేదు. బీఆర్ఎస్ హయాంలో వేసవిలో కూడా చెరువులు, కుంటలు నింపాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం నీళ్లు ఇవ్వక పంటలు ఎండిబెట్టింది. ఏడాది కాలంలోనే ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. అసత్య హామీలతో ప్రజా సంక్షేమాన్ని విస్మరించారు. రజతోత్సవ సభకు ప్రతి గ్రామం నుంచి అభిమానులు, ప్రజలు తరలిరావాలి. సభ సక్సెస్ కోసం బీఆర్ఎస్ శ్రేణులు కృషి చేయాలి.
-గాదరి కిశోర్, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే