
తిరుమలగిరి, జనవరి 1 : ‘నేను జనవరి ఫస్ట్ నుంచి మద్యం మానేస్తా.. ఇక ఈ రోజే లాస్ట్’ అంటూ డిసెంబర్ 31న ఓ మిత్రుడు శపథం చేస్తాడు. ‘దేవుడా.. కొత్త సంవత్సరం సరికొత్త మార్పు తీసుకురావాలి’ అని మరో మిత్రుడు.. ‘ఈ ఏడాదిలో ఏదైనా ఉద్యోగం సాధించాలి.. కుటుంబానికి ఆసరాగా మారాలి’ అని మరో మిత్రుడు.. ఇలా కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో అడుగులు వేస్తున్నారు. తెలుగు రాష్ర్టాల ప్రజలకు ఉగాది కొత్త సంవత్సరం అయినా ఆంగ్ల సంవత్సరంలోని జనవరి 1వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఇస్తుంటారు. ఏదేమైనా గడిచిన క్షణాలు తిరిగి రావు. గతించిన కాలాన్ని తిరిగి పొందలేం. ఇదే రీతిలో ఖర్చయిన డబ్బు కూడా తిరిగి రాదు. జల్సాల పేరిట వృథా చేసే డబ్బు ఎందరికి ఉపయోగపడిందో ఒక సారి మననం చేసుకోవాలి. కుటుంబ ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకోవాలి. పొదుపు మార్గాన్ని ఎంచుకోవాలి. నలుగురికి ఉపయోగపడేలా, వారు మెచ్చేలా అందరికీ ఆమోదం కలిగించేలా వ్యవహరిస్తే మనలోని సామాజిక స్పృహ సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. దీనిని గుర్తిస్తే సమాజమే దేవాలయంగా మారుతుంది. గతాన్ని మరిచి కొత్త సంవత్సరంలో సరి కొత్త నిర్ణయాలతో యువత అడుగులు ముందుకు కదిలితే అనేక ప్రయోజన కార్యక్రమాలు చేపట్టవచ్చు. సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలవొచ్చు.
చెడును వీడాలి… మంచిని కోరుకోవాలి…
యువత చెడు అలవాట్లను వదిలేసి మంచిని కోరుకోవాలి. తోటి వారికి చేతనైన సాయం చేయాలనే ఆలోచన పెంచుకోవాలి. పేదలకు, ఆపదలో ఉన్న వారికి ఆప్తులుగా మెలగాలి. కుటుంబ సంప్రదాయాలను గౌరవించాలి. కొత్త సంవత్సరంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాలి. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలి. ఇదే సందర్భంలో అవయవ దానంపై అవగాహన కల్పించాలి. ‘మానవ సేవే మాధవ సేవ’ అనే విషయాన్ని చాటాలి.
బంధాలు, అనుబంధాలకు ప్రాధాన్యమివ్వాలి..
బంధాలు, అనుబంధాలు మనిషి జీవితంలో చాలా గొప్పవి. వాటిని పెంచుకునే వారు సమాజంలో ఎప్పుడూ ఒంటరి వారు కారు. అనుబంధాలు తెంచుకునేవారు సమాజంలో ఒంటరిగా మిగిలిపోతారు. ఆరోగ్య కరమైన సమాజం కోసం యువత పాటుపడాలి. విలువలతో కూడిన చదువులకు ప్రాధాన్యమివ్వాలి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 1500 వివిధ యువజన సంఘాలు ఉన్నాయి. వారంతా క్రియాశీలకంగా పనిచేసి కొత్త ఆలోచనలతో మార్పు కోసం, సామాజ బాగు కోసం పనిచేయాలి.
క్రమశిక్షణ అలవర్చుకోవాలి..
యువత నియమబద్ద జీవిత అలవాట్లను అలవర్చుకోవాలి. ఈ తరహా క్రమ శిక్షణ కొనసాగించడం వల్ల తల్లిదండ్రులు, పెద్దల పట్ల ఎంతో గౌరవంగా నడుచుకునేవారమవుతాం. దురలవాట్ల నుంచి దూరంగా ఉండాలి. మత్తు, డ్రగ్స్, గంజాయి, ధూమపానం లాంటి వ్యసనాలకు బానిస కాకూడదు. దేశ జనాభాలో 50 శాతం యువత ఉన్న ఏకైక దేశం మనదే. బాధ్యతలు ఎరిగి ముందుకు సాగాలి. నూతన సంవత్సరం నవ వసంతం కావాలి.
పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలి
ప్రపంచమంతా పర్యావరణ పరిరక్షణ దిశగా అడుగులేస్తున్నది. అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సుల సారాంశమిదే. మనిషి వల్ల పర్యావరణానికి హాని కలుగుతున్నది. అరుదైన పక్షిజాతులు కనుమరుగవుతున్నాయి. పర్యావరణ పరిరక్షణకు నూతన సంవత్సరం ఆరంభాన్ని సదవకాశంగా యువత మలుచుకోవాలి. విస్తృతంగా మొక్కలు పెంచే కార్యక్రమాలు చేపట్టాలి. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్లాస్టిక్ నిర్మూలనకు పనిచేయాలి. రాబోవు తరానికి స్వచ్ఛమైన వాతావరణం అందించడం బాధ్యతగా మనం గుర్తించుకోవాలి.