స్వరాష్ట్రంలో రహదారులు అద్దంలా మారుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసి గ్రామాల నుంచి పట్టణాల వరకు రోడ్లను బాగు చేయడంతో ప్రయాణాలు సాఫీగా సాగుతున్నాయి. తుంగతుర్తి నియోజకవర్గంలో ఇప్పటికే 98 శాతం రహదారులు మెరుగ్గా ఉండగా, మిగిలిన రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర సర్కారు తాజాగా రూ.36.07 కోట్లు విడుదల చేసింది. జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం నుంచి తుంగతుర్తి మండలం సంగెం మీదుగా నూతనకల్ వరకు 21.5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.32 కోట్లు, నూతనకల్ మండల పరిధి దంతాలపల్లి రహదారి నుంచి మిర్యాల వరకు 4 కిలోమీటర్లకు రూ.4 కోట్లు మంజూరు చేసింది. ఈ రెండు రోడ్ల నిర్మాణంతో 17 గ్రామాలకుపైనే ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడనున్నది. జూన్ 29న తిరుమలగిరిలో జరిగిన ప్రగతి నివేదన సభలో ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ రోడ్లకు నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేయగా మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. అది కార్యరూపం దాల్చింది. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు. రహదారులకు నిధులు మంజూరుపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సూర్యాపేట, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): ఏ ప్రాంతమైన అభివృద్ధి చెందాలంటే రహదారులు, నీరు కచ్చితంగా ఉండాలి. అయితే గత ఉమ్మడి రాష్ట్రంలో ఈ రెండింటినీ కనీసం పట్టించుకోకపోవడంతో ప్రజలు అనుభవించిన ఇబ్బందులు అన్ని ఇన్నీ కావు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం ప్రాధాన్యత అంశాల్లో రహదారులు, తాగు,సాగు నీటిని చేర్చింది. మిషన్ భగీరథతో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు వస్తుండగా కాళేశ్వరంతో తుంగతుర్తికి జలధార చేరింది. ఇక రహదారుల విషయానికి వస్తే గ్రామాల్లో అంతర్గత రహదారులు, పంచాయతీల నుంచి మండల కేంద్రాలు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి రహదారులు వచ్చాయి. ఈ క్రమంలో తుంగతుర్తి నియోజకవర్గంలో కొన్ని రహదారుల అభివృద్ధి మిగిలి పోయాయి. జూన్ 29న ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ నేతృత్వంలో భారీగా జరిగిన ప్రగతి నివేదన సభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. మంత్రి ప్రసంగానికి ముందు ఎమ్మెల్యే తన ప్రసంగంలో తొమ్మిదిన్నరేళ్లలో జరిగిన ప్రగతిని నివేదిస్తూ ని యోజకవర్గంలో దాదాపు 98 శాతం రహదారులు పూర్తయ్యాయి.. మరో మూడు నాలుగు రహదారు లు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని వెంటనే మం జూరు చేయాలని మంత్రిని కోరారు. దాంతో మంత్రి కేటీఆర్ తన ప్రసంగంలో హామీ ఇవ్వగా నేడు అవి కార్యరూపం దాల్చాయి.
ఐదు నెలల్లో పూర్తి
తాజాగా విడుదలైన జీఓ ప్రకారం 21.5 కిలోమీటర్ల రహదారితో పాటు మరో 4 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి రూ.36.07 కోట్లు మంజూరయ్యాయి. జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం నుంచి తుంగతుర్తి మండలం సంగెం మీ దుగా నూతనకల్ వరకు 21.5 కిలోమీటర్లకు రూ.32 కోట్లు, దంతాలపల్లి నుంచి మిర్యాల వ రకు 4 కిలోమీటర్ల రోడ్డుకు రూ.4 కోట్లు మొత్తం 25.5 కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి రూ.36.07 కోట్ల మంజూరయ్యాయి. త్వరలోనే టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి మూడు నుంచి ఐదు నెలల్లోనే రహదారులను పూర్తి చేయనున్నారు. ఈ రోడ్లు పూర్తయితే తిమ్మాపురం, కోమటిపల్లి, కొమ్మాల, కొండూరు, సంగెం, ఎల్కపల్లి, చిల్పకుంట్ల, నూతనకల్ వరకు ఎనిమిది గ్రామాలతో పాటు ఆ రహదారి నుంచి వె ళ్లే మరో 7 గ్రామాలకు అంటే మొత్తం 14 గ్రామాలకు ప్రయోజనం చేకూరనుంది. కాగా ఇప్పటి వరకు తుంగతుర్తి నియోజకవర్గంలో రూ. 597.38 కోట్లతో పంచాయతీల్లో అంతర్గత రహదారులు, మండల కేంద్రాల నుంచి పంచాయతీలకు 2,928 చోట్ల పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ శాఖల ఆధ్వర్యంలో రోడ్ల పనులు పూర్తి కావడం గమనార్హం. నియోజకవర్గంలో ఎక్కడ రహదారి కావాలని ప్రజలు కోరినా వెంటనే మంజూరు చేయించిన ఎమ్మెల్యే కిశోర్ కుమార్ తిమ్మాపురం నుంచి నూతనకల్ వరకు మాత్రం 21.5 కిలోమీటర్ల అతి పెద్ద రహదారి కావడంతో ఎట్టి పరిస్థితుల్లో మంజూరు చేయిస్తాను ఎవరూ అనుమానం పడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ క్రమంలో ప్రగతి నివేదన సభతో ఈ రహదారికి మోక్షం కల్పించడంతో రహదారి వెంట ఉన్న గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తిమ్మాపురం-సంగెం రోడ్డు మరమ్మతుకు నిధుల మంజూరుపై హర్షం
అర్వపల్లి : మండలంలోని తిమ్మాపురం సంగెం రోడ్డు నిర్మాణానికి నిధులు మం జూరు హర్షం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ నాయకులు బుధవారం మండల కేంద్రంలో సీఎంకేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్, విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ర్యాలీగా తిరుమలగిరి ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి ఎమ్మెల్యే కిశోర్ కుమార్‌ను శాలువా, గజమాలతో సన్మానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుండగాని సోమేశ్గౌడ్, ఎంపీపీ మన్నె రేణుకాలక్ష్మీనర్సయ్యయాదవ్, జడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌యాదవ్, కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు రాష్ట్ర నాయకులు మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ కుంట్ల సురేందర్‌రెడ్డి, జిల్లా నాయకులు మొరిశెట్టి ఉపేందర్, నాయకులు బైరబోయిన రామలింగయ్య, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.
కిశోరన్న ఈ రోడ్డు కూడా చేస్తాడనుకున్నాము చేస్తుండు
చిన్నప్పటి నుంచి ఈ రోడ్డు మీదుగా ప్రయాణం చేస్తున్నాం. గుంతలు ఏనా డూ పూడ్చలేదు. ఎమ్మె ల్యే కిశోరన్న కొత్త రోడ్డు వేయించకున్నా గుంతలు పూడ్పించారు. ఈ రోడ్డుకు నిధులు పెద్ద ఎత్తున అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వేయిస్తానని హామీ ఇచ్చిండు..ఇచ్చినా హామీ మేరకు కొత్త రోడ్డు వేయిస్తాడనే నమ్మకం మాకు ఉంది.. ఇయ్యాల మంజూరైందని తెలిసింది. ఈ రోడ్డు పూర్తయితే మాకు గుంతల రహదారులే కనిపించవు. ఎమ్మెల్యే కృషిని ఎన్నటికీ మరవం.
-కేలోతు రవీందర్, నాన్యతండా, అర్వపల్లి