అర్వపల్లి, మే 23 : గ్రామాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నిధులను విడుదల చేయాలని బీఆర్ఎస్ సర్పంచుల ఫోరం డిమాండ్ చేసింది. శనివారం అర్వపల్లి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు సర్పంచులు మాట్లాడారు. గత రెండేళ్లుగా గ్రామాల్లో వాడుకున్న కరెంట్ బిల్లు బకాయిలను ఇప్పుడు చెల్లించాలని సర్పంచులపైన ఒత్తిడి తీసుకురావడం విడ్డూరంగా ఉందన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ.4 వేల చొప్పున ఆసరా ఫించన్ అందజేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీకి ఇచ్చే ఎస్ఎఫ్సీ నిధులను విడుదల చేయకుండా తాత్సారం చేయడం వల్ల గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతుందన్నారు.
జనవరి నెలలో సీఎం రేవంత్ రెడ్డి తన కొడంగల్ నియోజకవర్గంలో జరిగిన సర్పంచుల సమ్మేళనం సభలో ఇచ్చిన మాట ప్రకారం ఎస్డీఎఫ్ నిధుల నుంచి పెద్ద గ్రామ పంచాయతీకి రూ.10 లక్షలు, చిన్న గ్రామ పంచాయతీకి రూ.5 లక్షల చొప్పున విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ సర్పంచులు ఉన్న గ్రామాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు మంజూరులో వివక్ష చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాలు టీఎస్ బిపాస్ ద్వారా ప్రతి నెలా చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే సర్పంచుల గౌరవ వేతనం నెలనెలా క్రమం తప్పకుండా చెల్లించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సర్పంచులు వల్లపు గంగయ్య, కర్నాటి వెంకన్న, మేడి వీరస్వామి, బానోతు సైదులు, అంకిరెడ్డి వీరాంజనేయులు, నున్న యాదగిరి, కలకోట్ల శైలేందర్, నాయకులు బొడ్డు సోమరాజు, కేలోతు హరిలాల్ నాయక్ పాల్గొన్నారు.