యాదాద్రి భువనగిరి, జూలై 9 (నమస్తే తెలంగాణ): బీబీనగర్ ఎయిమ్స్‌లో ప్రస్తు తం 87శాతం పనులు పూర్తయ్యాయని, డిసెంబర్ నాటికి 100శాతం పూర్తి చేసి, అన్నిసేవలు అందుబాటులోకి తెస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా అన్నారు. గురువారం బీబీనగర్ ఎయిమ్స్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రధాని మోదీ విజన్‌కు అనుగుణంగా, రాబోయే రోజుల్లో బీబీనగర్ ఎయిమ్స్ దక్షిణ భారతదేశంలోనే అత్యుత్తమ అగ్రగామి వైద్య సంస్థగా మారుతుందన్నారు. బీబీనగర్ ఎయిమ్స్ దవాఖాన సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అవుతుందనే నమ్మకం ఉందన్నారు. దేశంలో మొదటిసారిగా ఎయిమ్స్ సంస్థలో కమ్యూనిటీ రేడియో స్టేషన్ ప్రారంభించిన ఘనత బీబీనగర్ ఎయిమ్స్‌కే దకిందన్నారు.
నిత్యం 1,800 మంది రోగులకు వైద్యసేవలు
2022 జూన్‌లో మంజూరైన బీబీనగర్ ఎయిమ్స్.. కేవలం నాలుగేండ్ల స్వల్ప కాలంలోనే ఎంతో వృద్ధి సాధించి సేవలందిస్తున్నదని తెలిపారు. దీని కోసం రూ.1,000 కోట్లకు పైగా నిధులు మంజూరు చేశామన్నారు. ప్రస్తుతం ఇకడ 132 మంది ఫ్యాకల్టీ, 133 మంది సీనియర్ వైద్యులు సేవలందిస్తున్నారని చెప్పారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులతో పాటు, 24 విభాగాల్లో ఎండీ, 5 విభాగాల్లో డీఎం, ఎంసీహెచ్ లాంటి సూపర్ స్పెషాలిటీ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు.
బీబీనగర్ ఎయిమ్స్ ఓపీడీ విభాగంలో అన్ని ప్రధాన స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వచ్చాయని, ఇకడ ప్రతిరోజూ సుమారు 1,800 మంది రోగులు వైద్య సేవలు పొందుతున్నారని మంత్రి నడ్డా ర్కొన్నారు. ఇన్ పేషెంట్ కేర్, ఎమర్జెన్సీ సేవలతో పాటు సీటీ సాన్, ఎంఆర్ ఐ, డెక్సా వంటి అత్యాధునిక పరీక్షల సౌకర్యం ఉన్నదన్నారు. ఈ-సంజీవని డిజిటల్ టెలీమెడిసిన్ ద్వారా ఇప్పటివరకు 1,56,000 మంది రోగులకు విజయవంతంగా వైద్య సలహాలు అందించారన్నారు. ఇకడ పీఎం-జై తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా వర్తింపజేస్తున్నామని చెప్పారు. ఈ సంస్థ ద్వారా 6 గ్రామాలను దత్తత తీసుకొని, ఇప్పటివరకు 547 ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించి, దాదాపు 6,148 మంది గ్రామీణ రోగులకు వైద్య సంరక్షణ అందించడం విశేషమన్నారు.
నాడు ఒకటే.. నేడు 23
20వ శతాబ్దం చివరి వరకు దేశంలో న్యూఢిల్లీలో కేవలం ఒకే ఒక ఎయిమ్స్ ఉండేదని, ఆ తర్వాత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి హయాంలో మరో 6 ఎయిమ్స్ సంస్థలు ఏర్పాటయ్యాయని గుర్తు చేశారు. మోదీ వచ్చాక ఎయిమ్స్ సంఖ్యను 23కి పెంచారన్నారు. దేశవ్యాప్తంగా 1,85,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ద్వారా దాదాపు 15 లక్షల మందికి ప్రాథమిక వైద్య సేవలు అందుతున్నాయని కేంద్ర మంత్రి అన్నారు. గతంలో కేవలం 370గా ఉన్న మెడికల్ కాలేజీల సంఖ్యను ఇప్పుడు 820 కాలేజీలకు పెంచినట్లు పేరొన్నారు. సమావేశంలో ఎంపీలు డా.లక్ష్మణ్, డీకే అరుణ, కిరణ్ కుమార్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ తదితరులు ఉన్నారు.