ప్రభుత్వ పాఠశాలల బలోపేతంలో కీలక భూమిక పోషించేవి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు(ఎస్ఎంసీలు). రెండేండ్ల వీటి పదవీకాలం ఈ నెల 31తో ముగియనుంది. మన ఊరు-మనబడి, మన బస్తీ- మన బడి కార్యక్రమ పనులు ఈ కమిటీల ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. చైర్మన్‌తోపాటు కమిటీ సభ్యుల సేవలువినియోగించుకునేలా ప్రభుత్వ వీరి పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు (జూన్1 నుంచి నవంబర్ 30 వరకు) పొడిగించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,113 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ఎస్ఎంసీలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
– రామగిరి, మే 21
రామగిరి, మే 21 :ప్రభుత్వ బడుల బలోపేతంలో విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తుల భాగస్వామ్యంతో పనిచేసేవి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ)లు. వీటినే విద్యా కమిటీలుగా పిలుస్తారు. ఈ కమిటీలు ఆయా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఉపాధ్యాయులతో కలిసి పనిచేస్తూ విద్యార్థుల విద్యాభ్యున్నతికి దోహదం చేస్తాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సర్కార్ బడుల్లో మౌలిక వసతుల కల్పనకై నిర్వహిస్తున్న ‘మన ఊరు-మన బడి’, మన బస్తీ-మన బడి’ కార్యక్రమ నిర్వహణ ఈ కమిటీల ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నాయి. అయితే వీరి పదవీ కాలం ఈ నెల 31తో ముగుస్తుండగా మరో ఆరు మాసాలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
30 నవంబర్,2023 వరకు గడువు పెంపు..
ప్రభుత్వం ఎస్‌ఎంసీల ఎన్నికకై 30 నవంబర్,2019న ఎన్నికలు నిర్వహించింది. వీటి గడువు 30 నవంబర్,2021తో ముగిసింది. కరోనా నేపథ్యంలో ఈ కమిటీల నిర్వహణ సాగలేదని, తమ సేవలు వినియోగించుకుండానే పదవీకాలం ముగుస్తుందని ఆవేదనతో ఉండటంతో మరో ఆరు మాసాలు 1డిసెంబర్, 2021 నుంచి 31మే,2022 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత మళ్లీ 1 జూన్, 2022 నుంచి 31మే, 2023కు పెంచారు. అయితే మన ఊరు-మనబడి కార్యక్రమాల నిర్వహణలో ఈ కమిటీలే కీలకంగా వ్యహరిస్తూ వీటి ఆధ్వర్యంలోనే పనులు కొనసాగుతుండటంతో సేవలు సద్వినియోగం చేసుకునేలా ప్రభుత్వం మరో ఆరు మాసాలు( 1జూన్ నుంచి 30నవంబర్,2023 వరకు) గడువు పెంచింది. ప్రభుత్వ నిర్ణయంపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్ఎంసీ చైర్మన్లు, కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,113 ప్రభుత్వ పాఠశాలలు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,113 ఫ్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో నల్లగొండ జిల్లాలో 1,485, సూర్యాపేట జిల్లాలో 909, యాదాద్రి భువనగిరి జిల్లాలో 719 పాఠశాలలున్నాయి. వీటిలోని ఎస్ఎంసీలు 30నవంబర్,2023 వరకు కొనసాగనున్నాయి.