నల్లగొండ, డిసెంబర్ 26 : ‘ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు అన్ని గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల్లో ప్రజా పాలన సభలు నిర్వహించాలి. ఆరు గ్యారెంటీలకు అర్హులందరూ దరఖాస్తు చేసుకునేలా బాధ్యతగా నిర్వహించి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలి.’ అని రాష్ట్ర వ్యవసాయ, మారెటింగ్ శాఖల మంత్రి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్చార్జి మినిస్టర్ తుమ్మల నాగేశ్వర్రావు అధికారులకు సూచించారు. నల్లగొండ పట్టణంలోని ఎంఎన్ఆర్ కన్వెన్షన్ హాల్లో మంగళవారం జిల్లా మంత్రులు నలమాద ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రజాపాలన కార్యక్రమంపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశానికి అధ్యక్షత వహించిన మంత్రి తుమ్మల మాట్లాడుతూ పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ నెల 28నుంచి వచ్చే నెల 6వరకు నిర్వహించే ప్రజాపాలన కార్యక్రమంలో పకడ్బందీగా, ప్రణాళికాబద్ధంగా దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు. ఇందుకోసం ఏర్పాట్లు పకాగా ఉండాలని, అందరికీ సౌకర్యంగా ఉండేలా ప్రణాళికలు రూపొందించి ప్రజలు దరఖాస్తులు నింపేలా యంత్రాంగాన్ని సమాయత్తం చేసుకోవాలని అన్నారు. హెల్ప్ డెస్, సాధారణ దరఖాస్తుల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రద్దీ ఎకువ ఉన్నచోట టీమ్‌లను పెంచాలని, రాష్ట్ర ప్రభుత్వ ప్రథమ కార్యక్రమాన్ని సమన్వయంతో విజయవంతం చేయాలని ఆదేశించారు.
జిల్లాలో 151 బృందాలు : నల్లగొండ ఇన్చార్జి కలెక్టర్ పాటిల్
జిల్లాలో నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ప్రజా పాలన కార్యక్రమాలు చేపడుతామని, ఇందుకోసం జిల్లా వ్యా ప్తంగా 151 బృందాలు ఏర్పాటు చేశామని నల్లగొండ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. మొత్తం 844 గ్రామపంచాయతీల్లో 112, ఎనిమిది మున్సిపాలిటీల్లోని 182 వార్డు ల్లో 39 టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజా పాలనలో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాలకు సంబంధించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. రోజూ ఉదయం 8 నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2నుంచి
సా యంత్రం 6 గంటల వరకు 2 షిప్టుల్లో నిర్వహిస్తామని తెలిపారు.
సూర్యాపేట జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సీహెచ్ ప్రియాంక మాట్లాడుతూ ప్రజా పాలన కార్యక్రమాల కోసం జిల్లాలో 58 బృందాలు ఏర్పాటు చేశామన్నారు. 475 గ్రామపంచాయతీల్లో 46, ఐదు మున్సిపాలిటీల్లోని 141 వార్డుల్లో నిర్వహించేందుకు 12 బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు కె.జెండగే జిల్లాలో చేపట్టే ప్రజాపాలన కార్యక్రమ ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమాన్ని పకడ్బందీ ఏర్పాట్లతో ప్రజల వద్దకు తీసుకెళ్తామని, ప్రభుత్వం ఆశించే లక్ష్యాలను నెరవేరుస్తామని అన్నారు. మున్సిపాలిటీల్లో 14, గ్రామీణ ప్రాంతాల్లో 37 కలిపి మొత్తం 51 బృందాలతో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం 1961 కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సన్నాహక సమావేశంలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌కుమార్ రెడ్డి, బాలూనాయక్, వేముల వీరేశం, నల్లమాద పద్మావతి, బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జయవీర్‌రెడ్డి, మందుల సామేల్, అదనపు కలెక్టర్లు జె.శ్రీనివాస్, భాసర్‌రావు, వెంకట్‌రెడ్డి, నల్లగొండ ఎస్పీ అపూర్వరావు, భువనగిరి డీసీపీ రాజేశ్చంద్ర, సూర్యాపేట ఏఎస్పీ నాగేశ్వర్రావు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ప్రజా పాలనకు తగిన ఏర్పాట్లు చేయాలి : మంత్రి కోమటిరెడ్డి
పటిష్టమైన ఏర్పాట్లు, తగిన టీమ్‌లతో ప్రజా పాలన దరఖాస్తులను స్వీకరించాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సూచించారు. మంచినీరు, కుర్చీలు, ఇతర వసతులు కల్పించాలని, ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. గిరిజన గ్రామ పంచాయతీల్లో దరఖాస్తుదారులు ఎవరూ మిస్ కావద్దని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అన్నారు. రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ పేదల వద్దకు ప్రభుత్వ పథకాలు తీసుకుపోవాలనేదే తమ ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. అధికారులు ఎకువ గంటలు పని చేయాలని, తెలంగాణ పునర్నిర్మాణంలో పాల్పంచుకోవాలని సూచించారు. యువతను పెడదారి పట్టించే బెల్ట్ షాపులు, గంజాయి అమ్మకాలపై పోలీసులు ఎకువ శ్రద్ధ పెట్టాలని.. ఇసుక, గంజాయి, వైన్ మాఫియాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసి అందరికీ అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు.
వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల అమలు : మంత్రి ఉత్తమ్
వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని, ప్రభుత్వ ఉద్దేశాలను అధికారులు నెరవేర్చాలని రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఆరు గ్యారెంటీల్లో రెండింటిని ఇప్పటికే అమలు చేస్తున్నామని, రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం త్వరలో మొదలు పెడుతామని చెప్పారు. ప్రజల సంక్షేమంలో పారదర్శకంగా, ప్రజాస్వామ్యయుతంగా ఉంటామని.. అధికారులు కూడా న్యాయంగా, ధర్మంగా, చట్టపరంగా ముందుకెళ్లాలని సూచించారు. ప్రజా పాలన కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తుల ఆధారంగానే ఆరు గ్యారెంటీలు అమలవుతాయన్నారు. తమ ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తుందని తెలిపారు. రేషన్ కార్డులపై కిలోకు రూ.39 వెచ్చించి పంపిణీ చేస్తున్న బియ్యం రీ సైక్లింగ్ అవుతూ పౌల్ట్రీలకు వెళ్తున్నదని, ఇది దుర్మార్గమైన విషయమని పేర్కొన్నారు. రేషన్ బియ్యం రీ సైక్లింగ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేషన్ సరఫరాలో ప్రక్షాళన చేస్తామని నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని అన్నారు.