నల్లగొండ, జూన్ 23: పేద విద్యార్థుల సం క్షేమం కోసం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న బెస్ట్ అవైలబుల్ పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం గం డికొడుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లో ఎప్పటికప్పుడు ఈ పథకానికి నిధులు మంజూరయ్యేవి. కాగా ఏడాదిన్నరగా నిధులకు బ్రేక్ పడింది. దీంతో ప్రైవేటు పాఠశాలలు ఉచితంగా తాము విద్యను బోధించలేమని చేతులెత్తేస్తూ…డబ్బులు కడితేనే పాఠశాలల్లోకి రావాలని, ప్రభుత్వం నుంచి నిధులు వస్తే మీరే తీసుకోవాలని తేల్చిచెప్పడంతో పలు సం ఘాలు ఉద్యమ కార్యాచరణను ప్రకటించి రం గంలోకి దిగాయి.
బెస్ట్ అవైలబుల్ స్కీం కింద రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రైవేటు విద్యా సంస్థల్లో 19వేల మంది ఎస్సీ విద్యార్థులు, ఆరు వేల మంది ఎస్టీ విద్యార్థులు ఉచితంగా చదువుకుంటున్నారు. అయితే వారికి రెండేండ్లుగా చెల్లించాల్సిన రూ.154కోట్ల బకాయిలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించకపోవ డంతో వివిధ పాఠశాలల్లో చెదివే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రెండేండ్లుగా బీఏఎస్ నిధుల విడుదలకు బ్రేక్..
బెస్ట్ అవైలబుల్ స్కీం కింద ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల్లో అర్హులైన, ఆసక్తి కలిగిన వారిని ఆయా సంక్షేమ శాఖల ద్వారా ఎంపిక చేసి పలు ప్రైవేటు విద్యా సంస్థల్లో చేర్పించి వారు ఉచితంగా చదువుకునేలా ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 19వేల మంది ఎస్సీ, ఆరు వేల మంది ఎస్టీ విద్యార్థులకు ప్రైవేటు విద్యా సంస్థల్లో ఉచిత విద్య అందుతుంది. అయితే ప్రతి విద్యార్థికీ రూ.35వేల మేర ప్రభుత్వం ఆయా విద్యాసంస్థలకు చెల్లిస్తుంది. బీఆర్ఎస్ సర్కార్ సైతం గత తొమ్మిదిన్నరేండ్లు ఎప్పటికప్పుడే ఈ పథకానికి నిధుల విడుదల చేసేది. అయితే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన ఈ రెండేండ్లల్లో ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. దీంతో మొ త్తం రాష్ట్రంలో ఆయా విద్యా సంస్థలకు రూ.154కోట్లు విడుదల చేయాల్సి ఉంది. వీటికోసం విద్యా సంస్థల యాజమాన్యాలు పోరాటాలు చేసినా ఫలితం లేదు.
పోరుబాటకు పలు సంఘాలకార్యాచరణ..
బీఏఎస్ నిధులు విడుదల చేయాలని విద్యా సంస్థల యాజమాన్యాలు పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం తో పలు సంఘాలు పోరుబాటకు కార్యాచరణ ప్రకటించాయి. ప్రస్తుతం పాఠశాలలు ప్రారంభం కావటంతోపాత బిల్లులు ఇవ్వాలని లేదంటే ఉచిత విద్యాబోధన మావల్ల కాదని విద్యాసంస్థలు ప్రకటించాయి. కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచనతో తాత్కాలికంగా విరమించినా పేరెంట్స్ కమిటీలతోపాటు పలు సంఘాలు నిధుల విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
నిధులు విడుదల చేయాలి
కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బెస్ట్ అవైలబుల్ స్కీం కింద ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవటం వల్లనే ఈ సమస్య ఉత్పన్నమైతుంది. నల్లగొండ జిల్లాలో రూ.7కోట్ల నిధులు రావాల్సి ఉంది. ముందు డబ్బులు కట్టండి ప్రభుత్వం డబ్బులు ఇవ్వగానే మీరే తీసుకోండి.. కానీ ఉచిత విద్య మాత్రం మావల్ల కాదంటూ విద్యా సంస్థలు చెప్పటంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం బీఏఎస్కు వెంటనే నిధులు విడుదల చేయకపోతే ఉద్యమిస్తాం.
– బొమ్మరబోయిన నాగార్జున, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి