మిర్యాలగూడ, జూలై 01 : చిట్టీల పేరుతో మోసాలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను నల్లగొండ జిల్లా మిర్యాలగూడ టూటౌన్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. సీఐ సోమనర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన సైదిరెడ్డి, కటికం వెంకట్‌రెడ్డి, ముత్తిరెడ్డికుంటకు చెందిన మామిళ్ల వెంకన్న, రాంనగర్‌కు చెందిన గుణగంటి జానయ్య కొంతకాలంగా చిట్టీల పేరుతో పలువురు నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎక్కువ వడ్డీ ఇస్తామని ఆశ చూపి 42 మంది నుంచి సుమారు రూ.1.50 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు.
డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుల వద్ద నుంచి 46 చిట్టీ పుస్తకాలు, 50 ప్రామిసరి నోట్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సమావేశంలో ఎస్ఐలు రాంబాబు, హర్షవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.