చివ్వెంల, అక్టోబర్ 21 : ఆరుగాలం రైతన్నలు కష్టపడి పండించిన పత్తి పంట చేతికి వచ్చిన సమయంలో దళారులు దోపిడీకి పాల్పడుతున్నారు. కొనుగోళ్లలో తూకా ల్లో మోసానికి ఒడిగడ్డి రైతులను దోచుకుంటున్నారు. చివ్వెంల మండలంలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. మండలంలోని గుంజూరు గ్రామానికి ఓ దళారీ పత్తి రైతులను మభ్యపెట్టి కొనుగోళ్లు జరుపుతున్నాడు. రెండు రోజులుగా ఈ తంతు జరుగుతుండగా.. ఒక బస్తాకు 8 నుంచి పది కేజీలు అదనంగా తూకం వేస్తున్నాడు.
గ్రామానికి చెందిన కొద్దిమంది రైతుల పత్తి బస్తాలు కాంటాలు వేశారు. కొప్పుల లక్ష్మీనారాయణ 35 బస్తాలు, కొప్పుల జ్యోతి 4 బస్తాలు, పెద్ది బాలకృష్ణ 10 బస్తాలు, కొనకంచి కామేశ్ 10 బస్తాలు కాంటా వేశారు. బస్తాలు బరువును బట్టి రైతులు గమనించి లారీలోకి లోడ్ చేసిన బస్తాలను మళ్లీ కాంటా వేయించారు. మొదట 84 కేజీలు ఉన్న బస్తా తిరిగి కాంటా వేసినప్పుడు 92 కేజీల బరువు తూగింది. దాంతో రైతులు కాంటాలను ఆపేశారు. ఆత్మకూర్(ఎస్) మండలం ఎనుబాముల గ్రామానికి చెందిన వ్యాపారి గుంజలూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ద్వారా అమ్మకాలు చేపడుతున్నట్లు రైతులు తెలిపారు.
ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
మార్కెట్కు పోదామంటే ధర గిట్టుబాటుగా లేదు. రవాణా ఖర్చులు అధికం. దాంతో ఊళ్లోనే అమ్ముకుందామని ఇక్కడ అమ్ముతుంటే దళారులు మోసం చేస్తున్నారు. తూకాల్లో మోసాన్ని రైతులం గమనించకున్నట్లయితే నష్టపోయేవాళ్లం. ప్రభుత్వం గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి, రైతులకు గిట్టు బాటు ధర కల్పించాలి.
-పెద్ది బాలకృష్ణ, పత్తి రైతు, గుంజలూరు