
భువనగిరి అర్బన్, జనవరి 1 : ఉరేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని అనాజీపురంలో శనివారం జరిగింది. అనాజీపురం గ్రామానికి చెందిన తెల్జిరి సాయికిరణ్ (24) కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌లో ఉండేవాడు. ఇటీవల తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. నాలుగు రోజుల క్రితం తల్లిదండ్రులు తిరిగి హైదరాబాద్ వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న సాయికిరణ్‌ను హైదరాబాద్ రమ్మని తల్లిదండ్రులు ఫోన్ చేయడంతో వస్తానని చెప్పాడు. ఈక్రమంలో ఉదయం టవల్‌తో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ సైదులు తెలిపారు.
రైలు కిందపడి యువకుడు..
చిట్యాల : మండలంలోని వట్టిమర్తి శివారులో రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలివి.. మండల మాండ్ర గ్రామానికి చెందిన ఉప్పరపల్లి మధుసూదనాచారి (22) వరికొత మిషన్‌పై ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి 11 గంటల వరకు స్నేహితులతో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నాడు. అర్ధరాత్రి అక్కడి నుంచి వెళ్లి రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు మధుసూదనాచారి స్నేహితులకు వాట్సాప్ ద్వారా తన లొకేషన్ పంపినట్లు తెలిసింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఒక్కగానొక్క కుమారుడు అర్ధాంతరంగా తనువు చాలించడంతో తల్లిదండ్రులు లింగాచారి, సైదమ్మ కన్నీరు మున్నీరయ్యారు.
కన్నారెడ్డికుంట తండాలో ఒకరు..
తిరుమలగిరి : మండలంలోని కన్నారెడ్డి కుంటతండాలో ఉరేసుకొని యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కన్నారెడ్డి కుంటతండాకు చెందిన లకావత్ ఆంజనేయులు (20) తాపీమేస్త్రీగా పనిచేస్త్తున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. తండ్రి రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లోకేశ్ తెలిపారు. మృతుడికి భార్య 5నెలల కుమారుడు ఉన్నాడు.
ఆరోగ్య సమస్యలతో వృద్ధుడు
దామరచర్ల : అనారోగ్యం, ఆర్థిక సమస్యల కారణంగా వృద్ధుడు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. దామరచర్లకు చెందిన నారాయణదాసు పుల్లయ్య (62) స్థానికంగా హమాలీ పని చేస్తున్నాడు. రెండేండ్లుగా అనారోగ్యం బాధిస్తుండడం, దీనికి తోడు ఆర్థ్ధిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో మనస్తాపం చెంది శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రపోయాక ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. గమనించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం 108 వాహనంలో మిర్యాలగూడ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా దవాఖానకు తరలించారు. కుమారుడు శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వాడపల్లి ఇన్చార్జి ఎస్ఐ వీరశేఖర్ తెలిపారు.
పురుగు మందు తాగిన యువకుడి మృతి
వలిగొండ : అనారోగ్యం బాధిస్తుండడంతో పురుగుల మందు తాగిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మండలంలోని మల్లేపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. మల్లేపల్లి గ్రామానికి చెందిన జెన్నీ మణి(23) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మనస్తాపానికి గురై నవంబర్ 26న పురుగుల మందు తాగాడు. స్థానికులు చికిత్స నిమిత్తం హైదారాబాద్‌లోని గాంధీ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. తండ్రి నర్సింహ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాఘవేందర్ గౌడ్ తెలిపారు