గరిడేపల్లి, మే 08 : సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామంలో 2015లో జరిగిన దారుణ హత్య కేసులో నలుగురు దోషులకు జీవిత ఖైదు విధిస్తూ హుజూర్నగర్ కోర్టు తీర్పు వెలువరించింది. శుక్రవారం గరిడేపల్లి ఎస్ఐ చలికంటి నరేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. పొనుగోడు గ్రామానికి చెందిన యెడిపాల వీరారెడ్డి, లింగారెడ్డి కుటుంబాల మధ్య భూ వివాదాలు కొనసాగుతున్నాయి. లింగారెడ్డి కుమారుడు అనారోగ్యానికి గురికావడానికి వీరారెడ్డి మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో 19 జూలై 2015న వీరారెడ్డిని హత్య చేసి, మృతదేహాన్ని గన్ని బ్యాగులో పెట్టి పొనుగోడు రిజర్వాయర్‌లో పడేశారు.
వీరారెడ్డి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం నిందితులు యెడిపాల లింగారెడ్డి, సత్యనారాయణరెడ్డి, ఉపేందర్‌రెడ్డి, సైదిరెడ్డిని అరెస్టు చేసి, ఘటనలో ఉపయోగించిన రెండు బైకులు, ఐరన్ రాడ్లు, హక్స్బ్లేడ్, పార తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కేసులో సాక్ష్యాధారాలను బలంగా ప్రవేశపెట్టడంతో మొదటి అదనపు జిల్లా & సెషన్స్ జడ్జి డాక్టర్ పి.శివరామ్ ప్రసాద్ నలుగురిని దోషులుగా తేలుస్తూ జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ.1,500 జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో 45 రోజుల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని న్యాయస్థానం పేర్కొంది.