నల్లగొండ ప్రతినిధి మార్చి 9 (నమస్తే తెలంగాణ). ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటివరకు ఆయా పార్టీలు ప్రకటించిన ఐదుగురు అభ్యర్థుల్లో నలుగురు అభ్యర్థులు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన వారే కావడం విశేషం. ఇప్పుడు వరకు ప్రకటించిన అభ్యర్థులు విజయశాంతి మినహా మిగతా నలుగురు జిల్లాకు చెందిన వారే. గతంలో ఎప్పుడూ ఇలాంటి సందర్బం లేదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన ఏకైక అభ్యర్థి దాసోజు శ్రవణ్ కుమార్ నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన వ్యక్తి. విద్యార్థి ఉద్యమాల నుంచే క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతూ తెలంగాణ ఉద్యమంలో కలిసి నడిచారు. దీనితో పార్టీ అధినేత కేసీఆర్ శ్రవణ్‌ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రకటించిన ముగ్గురు అభ్యర్థుల్లో ఇద్దరూ ఉమ్మడి జిల్లాకు చెందిన వారే. దామరచర్ల మండలానికి చెందిన మాజీ జడ్పీటీసీ సభ్యుడు, డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్‌ను ఎస్టీ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏఐఐసీ ప్రకటించింది.
ఇక మరో అభ్యర్థి అద్దంకి దయాకర్ కూడా ఆత్మకూరు(ఎస్) మండలం నెమ్మికల్‌కు చెందిన వ్యక్తే. మాల మహానాడు నేతగా గుర్తింపు పొంది కాంగ్రెస్‌లో చేరి రెండు సార్లు తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో తన సీటును త్యాగం చేయడంతో ప్రస్తుతం ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. ఇక గతంలో కుదిరిన ఎన్నికల పొత్తులో భాగంగా ఒక స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ సీపీఐకి కేటాయించింది.
సీపీఐకి ఇచ్చిన స్థానం కూడా నల్లగొండ జిల్లా వ్యక్తికే దక్కడం విశేషం. సీపీఐ నల్లగొండ జిల్లా కార్యదర్శిగా పని చేస్తున్న నెల్లికంటి సత్యం కూడా శాసనమండలిలో అడుగు పెట్టడం ఇక లాంచనమే కానుంది. మునుగోడు మండలం ఎలగలగూడేనికి చెందిన సత్యం సీపీఐలో కింది నుంచి జిల్లా కార్యదర్శి వరకు ఎదిగి వచ్చారు. గత ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ స్థానం కోసం పొత్తులో భాగంగా పట్టుపట్టారు. అప్పుడు పార్టీ నిర్ణయం మేరకు వెనక్కి తగ్గడంతో ప్రస్తుతం ఎమ్మెల్సీగా చట్టసభల్లో అడుగు పెట్టబోతున్నారు.