నల్లగొండ రూరల్, మే 20 : కార్మికులను బానిసలుగా చేసే నాలుగు లేబర్ కోడ్స్ ను తక్షణమే రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని సీఐటీయూ నల్లగొండ మండల కన్వీనర్ పోలే సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నల్లగొండ మండలం అప్పాజీపేట గ్రామంలో సీఐటీయూ ఆధ్వర్యంలో రైతులు, ఉపాధి కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, హమాలీ, ట్రాన్స్పోర్ట్ కార్మికులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తుందన్నారు. వారి లాభాల కోసమే ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటుపరం చేస్తుందన్నారు. బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాల్లో 29 చట్టాలను 4 లేబర్ కోడ్స్ మార్పు చేయడం దుర్మార్గమన్నారు. ఈ కోడ్స్ అమలు జరిగితే కార్మికులు బానిసలుగా మారతారన్నారు.
ఈ కోడ్స్ వల్ల కార్మికులు సమ్మె చేసే హక్కు, సంఘం పెట్టుకునే హక్కు, జీతభత్యాలు బేరమాడే హక్కు కోల్పోతారన్నారు. పని గంటలు 8 నుండి 12 గంటలకు పెరుగుతుందన్నారు. వెంటనే నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని, స్కీం వర్కర్లను పర్మినెంట్ చేయాలని, రైతులకు మద్దతు ధర చట్టం చేయాలని, ఉపాధి కూలీలకు 200 రోజుల పని దినాలను కల్పించి రూ.600 కూలి ఇవ్వాలని, ఆశ, వీఓఏ మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులకు మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని, అసంఘటితరంగ కార్మికులకు, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు పోతేపాక వినోద్ కుమార్, తంగెళ్ల మోహన్ రెడ్డి, వి.నరసింహ, డి.వాసిరెడ్డి, ఓ.లక్ష్మయ్య, వెంకన్న, కె.స్వామి, భిక్షం, పి.ఇందిర, ఎం.ఇందిరమ్మ, యాదమ్మ, ఇస్తారి, మణెమ్మ, జ్యోతి, లింగమ్మ, అండమ్మ, రామలింగం, యుగంధర్, భిక్షం, నరసింహ, సైదమ్మ, పద్మ, పిచ్చమ్మ పాల్గొన్నారు.
Nalgonda Rural : కార్మికులను బానిసలుగా చేసే లేబర్ కోడ్స్ రద్దు చేయాలి : పోలే సత్యనారాయణ