రామగిరి (నల్లగొండ), ఏప్రిల్ 26 : కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ల రద్దు కోసం దేశ వ్యాప్తంగా మే 20న నిర్వహించే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ.సలీం, తెలంగాణ ఆల్ హమాలి వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య పిలుపునిచ్చారు. శనివారం నల్లగొండ పట్టణం నెహ్రుగంజ్లోని హమాలి ఆఫీస్ లో పట్టణ ఎగుమతి, దిగుమతి హమాలి వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అలాగే కార్పొరేట్ అనుకూల, మతోన్మాద చర్యలను మరింత దూకుడుగా అమలు చేస్తుందని తెలిపారు.
కార్మిక వర్గం సమరశీల పోరాటాల ద్వారా వంద సంవత్సరాల్లో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను ముందుకు తెచ్చిందన్నారు. 2025- 26 బడ్జెట్లో కార్పొరేట్ అనుకూల విధానాలకు అనుగుణంగా కేటాయింపులు చేసిందని, సామాజిక సంక్షేమానికి కోతలు పెట్టిందని తెలిపారు. ఉపాధి, నిరుద్యోగం, అధిక ధరలు, ఆకలి, అసమానతలు, ఆరోగ్యం, రక్షణ లాంటి ప్రాథమిక సమస్యలను పట్టించుకోకపోగా ఈ సమస్యలు మరింత తీవ్రరూపం దాల్చే ఆర్థిక విధానాలను విచక్షణారహితంగా అమలు చేస్తుందని దుయ్యబట్టారు.
కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు అసోసియేషన్స్ మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ సమ్మె విజయవంతానికి కార్మిక లోకం సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు అద్దంకి నరసింహ, పట్టణ నాయకులు అవుట రవీందర్, నల్లగొండ పట్టణ ఎగుమతి దిగుమతి హమాలి వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ఔరేశు మారయ్య, సభ్యులు రోడ్డ నాగరాజు, వీరబాబు, వెంకన్న, అంజయ్య, లింగస్వామి సందీప్, రాజు, నరసింహ, ఎస్.నాగరాజు పాల్గొన్నారు.