చౌటుప్పల రూరల్ జూన్ 6 : చేనేత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పని చేస్తున్నదని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో రూ.95 లక్షలతో నిర్మించనున్న ఆధునిక చేనేత వస్త్ర విక్రయ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయనకు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్సీ ఎల్.రమణ, చేనేత కార్మికులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. చేనేత వస్ర్తాలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం ఆధునిక సౌకర్యాలతో చేనేత వస్త్ర విక్రయ భవంతి నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. చేనేత కార్మికులను ఇప్పటికే సంక్షేమ పథకాల ద్వారా అన్నివిధాలుగా ప్రభుత్వం ఆదుకుంటున్నట్లు తెలిపారు. చేనేత బీమా పథకం ద్వారా లబ్ధి పొందిన కార్మిక కుటుంబాలకు రూ.10 లక్షల చెక్కులు అందించారు. కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖ కార్యదర్శి బుద్ద ప్రకాశ్‌జ్యోతి, కలెక్టర్ పమేలా సత్పతి, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు, సింగిల్‌విండో చైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి, చేనేత జౌళి శాఖ అదనపు సంచాలకులు పి.వెంకటేశం, జిల్లా ఏడీకే విద్యాసాగర్, గడ్డం జయశంకర్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.