నీలగిరి, నవంబర్ 16: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఉద్యమకారుడిగా పార్టీ ప్రారంభం నుంచి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని పోరాటం చేసిన వ్యక్తి అని, ఆయనపై ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలు సరికాదని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. హరీశ్‌రావుకు కవిత సర్టిఫికెట్ అవసరం లేదని, ఎవరేమిటో కార్యకర్తలకు తెలుసని అన్నారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకు కేసీఆర్ పార్టీని స్థాపించినప్పుడు, రాష్ట్ర సాధన ఉద్యమంలో హరీశ్‌రావు పాత్ర ఏమిటో కార్యకర్తలకు తెలుసన్నారు. హరీశ్‌రావు పోరాటం చేస్తున్నప్పుడు కవిత విదేశాల్లో ఉన్నారన్నారు.
బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన తరువాత ఆమె జిల్లాల్లో పర్యటిస్తూ ప్రజాసమస్యలపై ప్రశ్నించకుండా కాంగ్రెస్ నాయకులకు అనుకూలంగా మాట్లాడుతున్నారన్నారు. అధికార పార్టీ గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని ఆమె పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి సహకరించారన్నారు. కేటీఆర్‌కు అండగా ఉండే హరీశ్‌రావు, గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిపై అరోపణలు చేస్తూ వారిని పార్టీకి దూరం చేసి, కేటీఆర్‌ను ఒంటరి చేసేందుకు రేవంత్‌రెడ్డి పన్నిన కుట్రలో కవిత పావుగా మారారన్నారు. కవిత లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కున్నప్పుడు పార్టీ క్యాడర్ ఆమె వెంటే ఉన్నారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలే కవిత మాట్లాడుతున్నారని చెప్పారు. ఆమె కాంగ్రెస్‌కు కోవర్టుగా మారి హరీశ్‌రావును ఒంటరి చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు.
తెలంగాణ జాగృతి పేరుతో కవిత వస్తే కేసీఆర్ బిడ్డ అనే గౌరవంతో బీఆర్ఎస్ కార్యకర్తలు హారతులు పట్టారన్నారు. పార్టీ కార్యకర్తల ఆత్మస్థయిర్యం దెబ్బతీసే విధంగా ఆమె వ్యవహార శైలి ఉన్నదన్నారు. హరీశ్‌రావును బయటికి పంపేందుకు అవినీతి మరక అంటించి పార్టీని చీల్చే కుట్ర జరుగుతోందన్నారు. ఎప్పటికైనా కేసీయారే తెలంగాణకు శ్రీరామరక్ష అని, ఆయన నాయకత్వంలోనే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు. ‘జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన తాము అధైర్యపడబోం. అడ్డదారిలో కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ అంటేనే మోసకారి పార్టీ. దయచేసి ఆ పార్టీ మాయలో కవిత పడొద్దు’ అని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలీ, మాజీ ఆర్వో మాలే శరణ్యా రెడ్డి, నల్గొండ మున్సిపాల్టీ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, కొండూరు సత్యనారాయణ, మైనం శ్రీనివాస్, దోటి శ్రీనివాస్, జమాల్ ఖాద్రీ, అయితగోని యాదయ్య, గుండ్రెడ్డి యుగంధర్ రెడ్డి, బొజ్జ వెంకన్న, గుండెబోయిన జంగయ్య, ఊటూరు సందీప్ రెడ్డి గంజి రాజేందర్ భీంపంగు కిరణ్ తదితరులు ఉన్నారు.