తుంగతుర్తి, నవంబర్ 20 : ఎన్నికల సమయంలో ప్రతి రైతుకూ రుణమాఫీ చేస్తామని, రైతుభరోసా ఇస్తామని హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అన్నదాతలను దగా చేసిందని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ అన్నారు. మండల పరిధిలోని అన్నారం గ్రామంలో బుధవారం ఆయన సీఎస్ఐ చర్చి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రేవంత్‌రెడ్డి దుర్మార్గపు పాలన కొనసాగిస్తున్నారని, రేవంత్‌రెడ్డిపై నమ్మకం లేక రైతులంతా దళారులు, మిల్లర్లకు అమ్ముకుంటున్నారని విమర్శించారు. గతంలో పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్ ధాన్యం ఇవ్వాలని, బ్యాంక్ గ్యారెంటీల పేరుతో మిల్లర్లను బ్లాక్మెయిల్ చేస్తున్నారని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు కాక రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో తుంగతుర్తి నియోజకవర్గంలో 78వేల టన్నుల ధాన్యం దిగుబడి అయితే ఈ ప్రభుత్వంలో దిగుబడి తగ్గిందన్నారు. మాజీ కేసీఆర్ కంటే గొప్పగా ఏదో చేస్తారని పొరపాటున ప్రజలు నమ్మి గెలిపిస్తే వాళ్ల రక్తాన్ని తాగుతున్న వ్యక్తి రేవంత్‌రెడ్డి అని, కేసీఆర్ మహావృక్షం అని, పీకే దమ్ము ఎవరికీ లేదని తెలిపారు. మూసీ ప్రక్షాళనకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదని, ప్రక్షాళన పేరుతో మీరు చేస్తున్న అవినీతి, దోపిడీని వ్యతిరేకిస్తున్నామని, మూసీ ప్రక్షాళనను కేసీఆర్ ప్రభుత్వంలో రూ.16వేల కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. మూసీ ప్రక్షాళన పేరుతో రేవంత్‌రెడ్డి ఢిల్లీకి డబ్బుసంచులు పంపి సీఎం సీటు కాపాడుకోవడానికి పూటకో మాట మాట్లాడుతున్నారని, ఇప్పటికి 32సార్లు ఢిల్లీకి వెళ్లి, మంత్రివర్గ విస్తరణ చేసే ధైర్యం రేవంతర్‌రెడ్డి లేదని ధ్వజమెత్తారు. ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయకుండా ద్రోహం చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. తొందరలోనే మోసపూరిత ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈసమావేశంలో బీఆర్ఎస్ పార్టీ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య, నాయకులు సంకెపల్లి రఘునందన్‌రెడ్డి, కల్లెట్లపల్లి ఉప్పలయ్య, గుండగాని రాములుగౌడ్, దొంగరి శ్రీనివాస్, గుండగాని దుర్గయ్యగౌడ్, మట్టిపల్లి వెంకట్, కడారి దాసు, ప్రవీణ్, పోతరాజు, రాములు, కడియం సైదులు పాల్గొన్నారు.