నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి4(నమస్తే తెలంగాణ) : కుల గణన, ఎస్సీ వర్గీకరణపై ప్రత్యేకంగా మంగళవారం అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా పోలీసులు అరెస్టుల పర్వం సాగించారు. మాజీ సర్పంచ్‌లపై ప్రత్యేకంగా దృష్టి సారించి అందరినీ ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టు చేశారు. తెల్లవారుజాము నుంచే గ్రామాల వారీగా గుర్తించి అదుపులోకి తీసుకుని ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారు. సాయంత్రం వరకు అక్కడే నిర్బంధించారు. గతేడాది జనవరిలో సర్పంచ్ల పదవి కాలం ముగియగా, పాలనా సమయంలో అనేక మంది అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. వాటికి సంబంధించిన బిల్లుల పెండింగ్‌లో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మాజీ సర్పంచ్‌లు గ్రామాల్లో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులపై తీవ్ర జాప్యం చేస్తున్నది. అనేకసార్లు ప్రభుత్వ పెద్దలకు తమ పెండింగ్ బిల్లులు చెల్లించాలని వినతి పత్రాలు సమర్పించారు. అయినా ప్రభుత్వం నుంచి చలనం లేకపోవడంతో దఫదఫాలుగా ఆందోళనకు దిగారు.
గత అసెంబ్లీ సమావేశాల సమయంలో సైతం చలో అసెంబ్లీకి పిలుపునివ్వగా ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి అరెస్టులు చేయించింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటనల సమయంలోనూ ముందస్తు అరెస్టులు చేశారు. తాజాగా మంగళవారం అసెంబ్లీ సమావేశం నేపథ్యంలో మాజీ సర్పంచ్‌లు చలో అసెంబ్లీకి వెళ్తారని భావించి పోలీసులు రంగంలోకి దిగారు. ఎక్కడికక్కడ మండలాల వారీగా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. నల్లగొండ, మిర్యాలగూడ, కనగల్, త్రిపురారం, కొండమల్లేపల్లి, నిడమనూరు, కట్టంగూరు, వేములపల్లి, మునుగోడు, నకిరేకల్, గుర్రంపోడు, చిట్యాల, గరిడేపల్లి, తుంగతుర్తితోపాటు మరికొన్ని మండలాల్లో మాజీ సర్పంచ్‌లను అరెస్టు చేసి స్టేషన్లలో నిర్బంధించారు. చలో హైదరాబాద్ వెళ్లేందుకు అనుమతి లేదని తేల్చిచెప్పారు. కాగా చట్టబద్ధంగా చేసిన అభివృద్ధి పనుల బిల్లులను ప్రభుత్వం చెల్లించకపోవడంతోపాటు తమ సమస్యలు విన్నవించుకుందామంటే అక్రమ అరెస్టులకు పాల్పడడం దుర్మార్గమంటూ మాజీ సర్పంచ్‌లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇప్పటికే ఏడాది కాలంగా బిల్లులు రాక తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగి ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.