సూర్యాపేట టౌన్, డిసెంబర్ 27 : తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తాజా మాజీ సర్పంచులు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చివ్వెంల, నూతనకల్ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు జూలకంటి సుధాకర్‌రెడ్డి, చూడి లింగారెడ్డి మాట్లాడుతూ అప్పులు తెచ్చి గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులు చేశామని, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని అందోళనలు చేస్తున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం 20 ఉత్తమ గ్రామ పంచాయతీల అవార్డులు ఇస్తే అందులో 19తెలంగాణకే రావడం తాము చేసిన అభివృద్ధికి నిదర్శనమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కనువిప్పు కలిగించి తమ బిల్లులు వెంటనే విడుదల చేసేలా చూడాలని మహాత్మాగాంధీకి వినతిపత్రం అందించినట్లు వారు చెప్పారు. కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచులు నిర్మల గోవిందరెడ్డి, దారావతు భద్రు, మానస రాము, వెంకన్న సుజాత, గురువేందర్, నాగయ్య, హనుమంతరావు పాల్గొన్నారు.