నీలగిరి, జూన్ 6: నల్లగొండ లతీఫ్సాబ్ గుట్టకు రోడ్డుమార్గం కాకుండా గుప్త నిధుల కోసం తవ్వుతున్నట్లుగా కాంట్రాక్టర్ పనులు చేస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా ఓపెన్ బ్లాస్టింగ్ చేస్తున్న కాంట్రాక్టర్‌ను అరెస్టు చేయాలని నల్లగొండ మాజీ శాసనసభ్యుడు కంచర్ల భూపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. బ్రహ్మంగారి గుట్ట, లతీఫ్ సాబ్ గుట్టలపై శుక్రవారం జరిపిన పేలుళ్లతో మునుగోడు రోడ్డు హోసింగ్ కాలనీలోని నివాసాలపై పెద్ద ఎత్తున బండ రాళ్లు పడి భయబ్రాంతులకు గురవుతున్న ప్రజలను శనివారం ఆయన కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
భయంతో రాత్రిపూట ఇండ్లు విడిచి బంధువుల దగ్గర తలదాచుకున్నామని ప్రజలు ఆయనకు వివరించారు. ఘాట్ రోడ్డు 20 మీటర్లు లోతు తవ్వుతున్నారని, అలా ఎందుకో అర్థం కావడం లేదని చెప్పారు. గుప్త నిధుల కోసం తవ్వు తున్నారేమోనని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కంచర్ల భూపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ శుక్రవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ముందస్తు సమాచారం లేకుండా సైరన్ ఇవ్వకుండా బ్లాస్ట్లింగ్ చేశారన్నారు. పెద్ద బండ రాళ్లు ఇండ్లపై పడి స్లాబ్లకు రంధ్రాలు ఏర్పడ్డాయని, రేకులపై పడటంతో పగిలి పోయాయని చెప్పారు. గతంలో ఈ విధంగానే రాళ్లు పడ్డాయని అధికారులకు చెప్పినా ఫలితం లేకుండా పోయిందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇండ్లు ఉన్న ప్రాంతాల్లో ఓపెన్ బ్లాస్టింగ్ ఎలా చేస్తారని ప్రశ్నించారు.
అదృష్టం బాగుండి ప్రాణాపాయం తప్పిందన్నారు. 20 మీటర్ల లోతు గుంతలు ఎందుకు తీస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుల జేబులు నింపడానికి అధికారులు పని చేస్తున్నారని విమర్శించారు. నగరంలో తాము మంజూరు చేయించిన పనుల నిధులను సీసీ రోడ్లకు, డ్రైనేజీలకు మళ్లించి ప్రజలకు ఉపయోగం లేనిచోట, కాంగ్రెస్ నాయకుల వెంచర్లున్న చోట నాణ్యత లేకుండా నిర్మిస్తున్నారని చెప్పారు. బ్లాస్టింగ్‌లో నష్టపోయిన కుటుంబాలకు పరిహారం ఇవ్వాలన్నారు. కాంట్రాక్టర్‌పై వెంటనే కేసు నమోదు చేయాలన్నారు. బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, కార్పొరేటర్లు మారగోని భవానీగణేశ్, పెరిక యాదయ్య, బాణావత్ దీప్లా, కుందూరి దీపికా ప్రవీణ్‌రెడ్డి, గోపగోని స్వాతీ రాజశేఖర్, జియడవల్లి సింగిల్ విండో చైర్మన్ దోటి శ్రీనివాస్, దండంపల్లి సత్తయ్య, పెరిక కరుణ్ జయరాజ్, మల్లికార్జున్ పాల్గొన్నారు.