నకిరేకల్, డిసెంబర్ 28 : నకిరేకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేముల వీరేశం రెండేళ్ల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేసిన శిలాఫలకాలు మార్చడం తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం నకిరేకల్‌లోని కడపర్తి రోడ్డులో దుమ్మూ, ధూళితో జనం పడుతున్న ఇబ్బందులను ఆయన అడిగి తెలుసుకున్నారు. కడపర్తి రోడ్డు ప్రారంభం నుంచి మార్కెట్ వరకూ ఇల్లిల్లూ తిరిగి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే వీరేశం ప్రారంభించిన శిలాఫలకం వద్ద విలేకరులతో మాట్లాడారు.
ఎమ్మెల్యే కక్షసాధింపు చర్యల్లో భాగంగా మూసీ రోడ్డులోని సమీకృత మార్కెట్ పనులు నిలిపివేయించారని, మున్సిపాలిటీలో ఒకటి, రెండు పనులు తప్ప అన్ని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసినవేనని, వెంటనే కడపర్తి బీటీ రోడ్డు పనులు ప్రారంభించాలని చిరుమర్తి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.కోట్ల నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేశామని గుర్తుచేశారు. నకిరేకల్ టౌన్ నుంచి కడపర్తి వరకూ బీటీ రోడ్డు మొదటగా రూ. 2.50 కోట్లతో ఫౌండేషన్ వేశామని, సరిపోదని చెప్పి అధికారులతో మాట్లాడి నకిరేకల్ మెయిన్ రోడ్డు రూ.26 కోట్లకు అదనంగా రూ.6 కోట్లు అదనంగా చేర్చి కడపర్తి రోడ్డుకు రూ.3 కోట్లు కేటాయించామన్నారు
. మొత్తం రూ.5.50 కోట్లతో రెండు వైపులా డ్రైనేజీ వచ్చేలా టౌన్ నుంచి ఏఎంఆర్పీ కాల్వ వరకూ ఎస్టిమేషన్, టెండర్, శాంక్షన్ ఆర్డర్ వచ్చిందన్నారు. 2023 డిసెంబర్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత నకిరేకల్ నుంచి గురజాల రోడ్డులోని కడపర్తి వరకూ 3 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే రూ. 10 కోట్లు మంజూరైనట్లు జీవో తెచ్చి హడావుడిగా శంకుస్థాపన చేశారన్నారు. రెండేళ్లయినా పనులు ప్రారంభించకుండా రోడ్డు వెంట ఉన్న పెద్ద పెద్ద చెట్లు తొలగించారన్నారు. దీంతో నేరుగా దుమ్ము, ధూళి ఇళ్లలోకి వెళ్లడంతో జనం ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.6 కోట్లతో ఈ రోడ్డులోనే శిలాఫలకం వేశామని, అది తొలగించి రూ.10 కోట్లతో మళ్లీ శిలాఫలకం వేశారని, మొత్తం రూ.16 కోట్లు ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నించారు.
ఇప్పటికైనా కడపర్తి రోడ్డు బీటీ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. తన హయాంలో రూ.26 కోట్లతో సెంట్రల్ లైటింగ్, డివైడర్లు, రోడ్లు పూర్తి చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత శిలాఫలకం మార్చారని, మిగిలిన 5 శాతం పనుల్లో భాగంగా డివైడర్ మధ్యలో మొక్కలు పెంచాలని నిబంధన ఉన్నా ఇప్పటివరకూ చేపట్టలేదన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, కౌన్సిలర్ పల్లె విజయ్, మాజీ ఎంపీటీసీలు గుర్రం గణేష్, రాచకొండ వెంకన్న, నాయకులు పెండెం సదానందం, రావిరాల మల్లయ్య, సామ శ్రీనివాస్‌రెడ్డి, దైద పరమేశ్, కొండ వినయ్, అవిరెండ్ల జనార్దన్, చిట్యాల అశోక్ తదితరులు పాల్గొన్నారు.