నకిరేకల్, మార్చి 23 : రేవంత్‌రెడ్డికి చంద్రబాబునాయుడు మీద ఉన్న ప్రేమ తెలంగాణ రైతాంగం మీదలేదని, ఆంధ్రాకు నీళ్లు తరలిస్తుంటే సీఎం రేవంత్‌రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమకుమార్‌రెడ్డి చేతులు కట్టుకుని చూస్తున్నారే తప్ప ఒక్క స్టేట్మెంట్ ఇచ్చిన దాఖలాలు లేవని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
పదోతరగతి పరీక్షా పత్రం లీక్‌లో అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారని, మున్సిపల్ చైర్మన్ డ్రైవర్, మాజీ సర్పంచి డ్రైవర్, ఎమ్మెల్యేకు లెఫ్ట్, రైట్ ఉన్న వ్యక్తులే పేపర్ లీక్ చేశారని ఆరోపించారు. ఎంతో మంది కష్టపడి చదువుకున్న విద్యార్థుల భవిష్యత్‌ను ఆగం చేసే చర్యలు పాల్పడ్డారని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీని కోరుతున్నామన్నారు. రెండు లక్షలు, ఆపై పంట రుణం తీసుకున్న వారికి రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి చాలా సందర్భాల్లో చెప్పారని, కానీ అరకొర చేసి చేతులు దులుపుకున్నారని తెలిపారు.
42 లక్షల మంది రైతన్నలు బ్యాంకుల్లో అప్పులు తీసుకుంటే 16.25 లక్షల మందికి రూ.20 కోట్ల మాత్రమే మాఫీ చేశారని, ఇంకా రూ.10 వేల కోట్లు చేయాల్సి ఉందని చెప్పారు. రూ.2 లక్షల పైన పంట రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ చేయబోమని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చెప్పడం ఎంత వరకు సమంజసమని అన్నారు. బాధ్యత గల పదవిలో ఉండి ముఖ్యమంత్రి, మంత్రులు తాగుబోతులు మాదిరిగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రైతు భరోసాపై స్పష్టమైన వైఖరి లేదని విమర్శించారు.
ఎన్నికల్లో కేసీఆర్ ఎకరానికి రూ.10 వేలు ఇస్తా అంటే రూ. 15 వేలు ఇస్తా అని గొప్పలు చెప్పుకున్న రేవంత్‌రెడ్డి ఇప్పటివరకూ రైతుభరోసా గానీ, రుణమాఫీ గాని సంపూర్ణంగా ఇవ్వలేదని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయని ప్రభు త్వం హడావుడిగా మండలానికి ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేసి అన్ని పథకాలు అందజేస్తామని ఇప్పటి వరకూ ఏ ఒక్కటి సక్రమంగా అమలు చేయలేదని అన్నారు. టెక్నికల్ సమస్యలను సాకుగా చూపుతూ రుణమాఫీ కోసం రైతులను ఆఫీసుల చుట్టూ తిప్పడం కరెక్ట్ కాదన్నారు.
గ్రామా ల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, నల్లగొండ జిల్లా లో ఇద్దరు మంత్రులు ఉండి చెరువులు, కుంటలు నింపకుండా ఈ సంవత్సరం కరువుకు, పంట పొలాలు ఎండిపోవడానికి కారణమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండిపోయిన పంటపొలాలను పరిశీలించే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదన్నారు. ఎండిన పంటలకు ఎకరానికి రూ.50 వేలు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ సీజన్లో వరి కోతలు ప్రారంభమవుతున్నాయని, ప్రతి గింజ దళారుల చేతికి పో కుండా, సరిపడా గన్నీబ్యాగులు ఏర్పాటు చేయాలని, ధాన్యానికి బోనస్ ఇవ్వాలని కోరారు. రైతుల సమస్యలు పరిష్కరించే వరకూ బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని హెచ్చరించారు.
ఈ సమావేశంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, కౌన్సిలర్ పల్లె విజయ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రగడపు నవీన్‌రావు, మాజీ ఎంపీటీసీలు గుర్రం గణేశ్, రాచకొండ వెంకట్, నాయకులు సామ శ్రీనివాస్‌రెడ్డి, యానాల లింగారెడ్డి, గొర్ల వీరయ్య, దైద పరమేశం, రాచకొండ శ్రవణ్, అవిరెండ్ల జనార్దన్, కొండ వినయ్ పాల్గొన్నారు.